చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య కథ తనది అంటూ రాజేష్ అనే వ్యక్తి మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. బి.గోపాల్ వద్ద కొన్నేళ్ల పాటు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన ఈ వ్యక్తి.. చాలా కష్టపడి ఆచార్య కథ (ఇతడు పెట్టుకున్న పేరు 'పెద్దాయన') రాసుకున్నానని.. కానీ మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా ఆ కథ కొరటాలకు చేరి, అట్నుంచి అటు ఆచార్యగా మారిందని ఆరోపిస్తున్నాడు.
అయితే ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై కొరటాల కాంపౌండ్ నుంచి మరో భిన్నమైన కథనం వినిపిస్తోంది. నిజానికి ఇది రాజేష్ రాసుకున్న 'పెద్దయన' అనే కాన్సెప్ట్ అనే విషయం కొరటాలకు తెలియదట. కొరటాల రైటింగ్ టీమ్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఈ కథను కొరటాలకు వినిపించాడని, అలా అది ఆచార్యగా రూపుదిద్దుకుందంటూ ఓ ప్రచారం మొదలైంది.
అయితే కొరటాల రైటింగ్ టీమ్ లో ఉన్న ఆ వ్యక్తికి ఈ కథ ఎలా తెలిసిందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రైటర్స్ అసోసియేషన్ లేదా డైరక్టర్స్ అసొసియేషన్ ద్వారా ఈ కథను అతడు తెలుసుకొని.. తన కథగా కొరటాలకు వినిపించి ఉండొచ్చనేది ఆ ఆకాశరామన్న కథనం సారాంశం. ఏదేమైనా ఈ విషయంలో కొరటాల తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం ఈ కథనంలో క్లియర్ గా కనిపిస్తోంది.
మరోవైపు ఈ మొత్తం వ్యవహారానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది ఆచార్య యూనిట్. సినిమాను నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ మేరకు ఓ భారీ ప్రకటన విడుదల చేసింది. ఆచార్య సినిమాకు సంబంధించి కథ-కథనాలన్నీ పూర్తిగా కొరటాల ఆలోచనల నుంచి వచ్చాయని.. ఆచార్య కథ కాపీ అంటూ వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి కొట్టిపారేసింది సదరు సంస్థ.
ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన తర్వాత మాత్రమే ఇలాంటి ఆరోపణలన్నీ తెరపైకొచ్చాయని, ఫస్ట్ లుక్ పోస్టర్ కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తుంటే.. కొంతమంది రైటర్లు మాత్రం ఈ కథపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది సదరు నిర్మాణ సంస్థ.
ఆచార్య కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసని స్పష్టం చేసిన మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ.. కేవలం మోషన్ పోస్టర్ చూసి కథ తమదే అంటూ ఎలా క్లెయిమ్ చేసుకుంటారని ప్రశ్నించింది. తమది పూర్తిగా ఒరిజినల్ కథ అని ప్రకటిస్తూ.. కొరటాల శివను వెనకేసుకొచ్చింది సినిమా యూనిట్.
చిరంజీవి దృష్టిలో పడడానికి, ఆయనకు విషయం చేరవేయడానికి మాత్రమే మీడియాకెక్కానని చెప్పుకుంటున్నాడు రాజేష్. ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి ప్రకటన వచ్చిందంటే.. కచ్చితంగా చిరంజీవి ఆమోదంతోనే వచ్చి ఉంటుంది. సో.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం తప్ప రాజేష్ కు మరో ప్రత్యామ్నాయం లేదు.