విశాఖ కేంద్రంగా ఇవ్వాళ కాకుంటే ఎప్పటికైనా పాలనా రాజధాని రావడం పక్కా. జగన్ తనకు వున్న నాలుగేళ్ల సమయంలో పాలనా రాజధాని సంగతి ఎలా వున్నా, విశాఖను అన్ని విధాలా ప్రగతి పథంలో నడిపించాలనుకుంటున్నారు. విశాఖ నుంచి రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ రహదారి రాబోతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, భీమిలి టు భోగాపురం నాలుగులైన్ల రహదారి, ఐటి టవర్స్, అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా చాలా విధాలా విశాఖను అభివృద్ది చేయబోతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రలో రాజకీయంగా కూడా పెను మార్పులు చోటు చేసుకుంటాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం వైకాపా కీలక నేత విజయసాయి రెడ్డికి కరోనా సోకిన టైమ్ లో ఒక్కసారికి ఉత్తరాంధ్ర వైకాపాలో రాజకీయాలు చకచకా నడిచాయి. తేదేపా నేత గంటా శ్రీనివాసరావును వైకాపాలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయి. గంటా రాకూడదని అవంతి శ్రీనివాస్ బాహాటంగానే ధ్వజమెత్తారు.
విజయసాయిరెడ్డితో ఉత్తరాంధ్ర కీలకనేత బొత్స సత్యనారాయణకు పొసగడం లేదని, అందుకే ఆయనే గంటాను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మరో కీలక నేత సజ్జల ద్వారా చేస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి,. ఇదే సమయంలో విజయసాయి మీద సోషల్ మీడియాలో కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు జరిగాయి. వీటి వెనుక కూడ బొత్స హస్తం వుందని వదంతులు వినిపించాయి.
ఇలాంటి నేపథ్యంలో త్వరలో బొత్స మంత్రి పదవి విషయంలో కీలకమార్పులు సంభవించే వస్తాయని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. బొత్సను పార్టీ పనులకు పరిమతం చేసి, బొత్స సంబంధీకులు మరొకరిని కానీ, కొలగట్ల వీరభద్రస్వామిని కానీ యాక్టివ్ రోల్ లోకి తీసుకువచ్చే ఆలోచన వుందని తెలుస్తోంది. నిజానికి బొత్సాను పక్కన పెట్టేంత బోల్డ్ డెసిషన్ ఆయన ఏ పార్టీలో వున్నా తీసుకోరు. కానీ జగన్ వ్యవహారం అలా కాదు. ఆయన అనుకుంటే చేసేస్తారు అంతే. ఇప్పటికే ఈ మేరకు కొన్ని ఇండికేషన్లు జిల్లా రాజకీయ వర్గాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
నిజంగా ఇదే మార్పు జరిగితే అది నిజంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది. విజయనగరం జిల్లాలో ఇప్పటికే క్షత్రియులకు సముచిత ప్రాధాన్యం వుంది. కాపుల నుంచి బొత్స మంత్రిగా వున్నారు. బొత్స కుటుంబంలోనే మరొకరికి మంత్రి పదవి ఇచ్చినా, బొత్స రేంజ్ లో చక్రం తిప్పడం అసాధ్యం అవుతుంది. అప్పుడు ఇక ఈ మధ్య జరిగినట్లు బ్యాక్ గ్రవుండ్ హడావుడులు జరిగే అవకాశం వుండదు.
విజయసాయిరెడ్డి- సజ్జల మధ్య ఆధిపత్య పోరు వుందని వైకాపా అంతర్గత వర్గాల్లో టాక్ వుంది. అదే ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను మలుపుతిప్పుతుందని అనుకోవాలి. ఇదే కనుక జరిగితే వైకాపాలో విజయసాయి అప్పర్ హ్యాండ్ మరోసారి రుజువు అవుతుంది.