ప్రియాంక చోప్రా అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్‌గా స్థిరపడ్డారు. తన నటనతో పాటు అందచందాలతో విశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. వెండితెరపై కంటే ముందుగా ఆమె మోడల్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు.
2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరిగా ఎంపికై యావత్ ప్రపంచ దృష్టిని తన వైపు మరల్చుకున్నారు. ప్రపంచ సుందరిగా ఎంపికైన తర్వాత సినిమా రంగం కన్ను ఆమెపై పడింది.
తమిళన్ (2002) అనే తమిళ చలన చిత్రంతో నటిగా తెరంగేట్రం చేశారు. అనంతరం అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై (2003) చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. రాజ్ కన్వర్ దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన అందాజ్ చిత్రంతో పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు.
ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాల కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా పోయింది. ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా సంథింగ్ స్పెషలే అనేట్టు తయారైంది.
తాజాగా ప్రియాంకా చోప్రా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను భయపడిన, ఇబ్బంది పడ్డ క్షణాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ 20 ఏళ్లపాటు వెనక్కి వెళ్లారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
2000వ సంవత్సరం ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న సందర్భంలో తాను వేసుకున్న తెలుపు రంగు డ్రెస్ గురించి చెప్పుకొచ్చారు. ఆ డ్రెస్ తనను చాలా ఇబ్బంది పెట్టినట్టు గుర్తు చేశారు. ఎందుకంటే ఆ డ్రెస్ తన శరీరానికి పూర్తిగా అతుక్కుపో వడంతో పాటు డ్రెస్ టేపు ఊడిపోయిందని చెప్పారు.
ఆ క్షణంలో తనలో ఒక రకమైన వణుకు పుట్టిందన్నారు. దానికి కారణం తన డ్రెస్ జారిపోతుందేమోననే భయం వేయడమే అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకకు నెలవైన ఆ వేదికపై నడిచిన ప్రతిసారి నమస్కారం పెడుతున్నట్టు చేతులు పెట్టి డ్రెస్ జారిపోకుండా పట్టుకున్నట్టు ప్రియాంక ఆశ్చర్యంగా చెప్పుకొచ్చారు.
అలాగే 2018 మెట్ గాలా లుక్ కోసం ధరించిన బ్లడ్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ కూడా చాలా ఇబ్బందిపెట్టినట్టు ప్రియాంక గుర్తు చేసుకున్నారు. ఆ డ్రెస్ బరువు వల్ల పక్కటెముకల ఆకారం మారిపోతుందేమోనని అనిపించిందని చెప్పి ఆశ్చర్యపరిచారామె.
ఆ డ్రెస్ ధరించినంతసేపు ఊపిరి పీల్చుకోలేకపోయానని, సరిగ్గా తినలేకపోయానని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.