తమిళ హీరో సూర్యపై చెన్నై హైకోర్టు దయ చూపింది. సూర్యపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది. దీంతో తమిళనాడులో ఉత్కంఠకు తెర పడింది. నీటి పరీక్షల నిర్వహణకు సంబంధించి న్యాయమూర్తులను కించపరిచేలా సూర్య వ్యాఖ్యానించారని, కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.
దీనిపై తాజాగా హైకోర్టు స్పందిస్తూ, సూర్య వ్యాఖ్యలు అనవసరమైన, సమర్థించదగ్గవి కాదని పేర్కొంది.
అలాగే కరోనా విపత్కర, క్లిష్ట పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తోందని చెన్నై హైకోర్టు వెల్లడించింది. తమ పనితీరును తక్కువ చేసి మాట్లాడటం తగదని సూర్యకు హితవు పలికింది.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే… కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ పరీక్షలు నిర్వహించడం తగదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అంతేకాదు, ఐదారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీట్ పరీక్షలు నిర్వహించవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లలో కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి నీట్ పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపింది.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డంతో హీరో సూర్య తీవ్రంగా స్పందించారు. ‘విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదది. ఇది నా మనసును ఎంతగానో కలచివేసింది. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను మాత్రం భయం లేకుండా పరీక్షలు రాయమని ఆదేశిస్తారు’అని ట్వీట్లు చేశారు.
సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నైతికతపై సూర్య ట్వీట్లు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, తమిళంలో ఉన్న ట్వీట్లను అన్వయంలో, అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని, సూర్య ట్వీట్లలో నైతికత అన్న పదమే లేదని చాలా మంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా సూర్య విషయంలో హైకోర్టు సంయమనంతో వ్యవహరించి సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టింది.