ది కేర‌ళ స్టోరీ.. ఆధారాలు చూప‌కుండా ఇలా ఎలా?

కేర‌ళ నుంచి 32 వేల మంది మ‌హిళ‌లు అదృశ్యం అయ్యార‌ని, వారు ఇష్ట‌పూర్వ‌కంగానో, బ‌ల‌వంతంగానో ఐసిస్ లోకి పంప‌బ‌డ్డారనే థీమ్ తో.. ది కేర‌ళ స్టోరీని రూపొందించారు. సాధార‌ణంగా ఒక సినిమా విడుద‌ల‌కు ముందే…

కేర‌ళ నుంచి 32 వేల మంది మ‌హిళ‌లు అదృశ్యం అయ్యార‌ని, వారు ఇష్ట‌పూర్వ‌కంగానో, బ‌ల‌వంతంగానో ఐసిస్ లోకి పంప‌బ‌డ్డారనే థీమ్ తో.. ది కేర‌ళ స్టోరీని రూపొందించారు. సాధార‌ణంగా ఒక సినిమా విడుద‌ల‌కు ముందే ఇలాంటి వివాదాలు రేగితే, సినిమా చూడ‌కుండానే త‌మ‌పై విరుచుకుప‌డుతున్నారంటూ స‌ద‌రు సినిమా రూప‌క‌ర్త‌లు ప్ర‌క‌టించుకుంటూ ఉంటారు. ముందు సినిమా చూసి మాట్లాడాల‌ని అంటూ ఉన్నారు. అయితే ఈ సినిమా రూప‌క‌ర్త‌లు త‌మ టీజ‌ర్లోనే ఈ థీమ్ ను ప్ర‌క‌టించారు. దీంతో దీనిపై వివాదం రాజుకోవ‌డంలో విచిత్రం లేదు.

మ‌రి ఒక‌రో ఇద్ద‌రో, ప‌ది మందో, వంద మందో ఇలా అదృశ్యం అయ్యార‌ని.. వారు ఐసిస్ లో చేరార‌నో, ఐసిస్ అకృత్యాల‌కు బ‌ల‌య్యార‌నో చెబితే .. చూసే వాళ్లు కూడా కాబోలు అనుకుంటారు. అయితే ఏకంగా 32,000 మంది ఇలా అదృశ్యం అయ్యారంటే.. పోయేది కేర‌ళ ప‌రువే కాదు, భార‌త‌దేశం ప‌రువు కూడా! ముప్పై రెండు వేల మంది ఇలా అదృశ్యం అయ్యారంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వం కాదు, కేంద్రం ఏం చేస్తున్న‌ట్టు? ఇంత వ్య‌వ‌స్థ ఏం చేస్తున్న‌ట్టు? ఇన్ని వేల మంది అదృశ్యం అయితే.. ఎంత‌మంది పోలిస్ స్టేష‌న్ల‌ను అయినా ఆశ్ర‌యించి ఉంటారు?

ఇలా ఒక రాష్ట్రంలో రెండేళ్ల వ్య‌వ‌ధిలో ముప్పై రెండు వేల మంది మాయ‌మ‌య్యార‌ని, వ్య‌వ‌స్థ క‌ళ్లు గ‌ప్పి వారందరినీ ఎక్క‌డో మిడిల్ ఈస్ట్ లోని ఉగ్ర‌వాద సంస్థ‌లు తీసుకెళ్లిపోయాయ‌ని సినిమాలు తీస్తే.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రం చెప్ప‌డంలో వింత లేదు!

ఏ అల్ల‌ర్లు జ‌రిగాయనో, హ‌త్య‌లు జ‌రిగాయ‌నో.. మార‌ణ‌కాండ జ‌రిగింద‌నో సినిమా తీయ‌డం కంటే, ఇలా మాయం అయిపోయార‌ని సినిమా తీయ‌డం ప్ర‌జ‌ల‌ను కూడా భ‌య‌పెడుతుంది. ఆ రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బ‌తీస్తుంది. 

కేర‌ళ‌లో ఐసిస్ లింకులో, లేదా ఐఎస్ఐ లింకులో చూపుతూ సినిమాలు రావ‌డం కొత్త కాదు. ది ఫ్యామిలీ మ్యాన్ ఫ‌స్ట్ సీజ‌న్లో ఐసిస్  లింకులు కేర‌ళ‌కే చూపించారు. అందులో ప్ర‌ధాన విల‌న్ కేర‌ళ‌లోని కాస‌ర‌గోడ్ నుంచి ఐసిస్ వైపు వెళ్లిన‌ట్టుగా చూపుతూ ఉంటారు. కేర‌ళ‌లో ముస్లింల జ‌న సాంద్ర‌త‌ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో కాస‌ర‌గోడ్ జిల్లా ముఖ్య‌మైన‌ది. మ‌రి ఐసిస్ తో కేర‌ళ లింకులు అంటూ చూపార‌ని అప్పుడెవ్వ‌రూ ర‌చ్చ‌కెక్క‌లేదు. 

అయితే ఆధారాలు చూప‌కుండా ఇలా ఏకంగా 32 వేల మంది మాయ‌మంటూ చూప‌డం.. త‌మ‌కు రాజ‌కీయంగా లొంగ‌ని ఒక రాష్ట్రంపై ఎవ‌రో కావాల‌ని విషం జ‌ల్లుతున్న‌ట్టుగా ఉందంతే!