
ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ హెలెన్‌కు చంద్రబాబు ఝలక్ ఇచ్చారని సమాచారం. కొంత కాలం క్రితం ఆమెను సత్యవేడు ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు వెలువరించారు.
సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్. రాజకీయ నేపథ్యం ఉండడంతో పాటు విద్యావంతురాలు, అంతకు మించి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయనే కారణంతో డాక్టర్ హెలెన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారనే ప్రచారం జరిగింది. అయితే సత్యవేడులో ప్రత్యర్థుల్ని ఆమె తట్టుకోవడం ఈజీ కాదని చంద్రబాబుకు నివేదికలు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.
డాక్టర్ హెలెన్ అభ్యర్థి అయితే వైసీపీ సులువుగా మరోసారి ఆ స్థానం నుంచి గెలుపొందుతుందని చంద్రబాబు దృష్టికి ముఖ్య నాయకులు తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, ప్రస్తుతానికి సత్యవేడులో పార్టీ బలోపేతానికి పని చేయాలని డాక్టర్ హెలెన్‌కు చంద్రబాబు సూచించినట్టు సమాచారం.
చెన్నైలో ఉన్న తనను సత్యవేడుకు తీసుకొచ్చి, ఇప్పుడిలా చెప్పడం ఏంటని డాక్టర్ హెలెన్ ప్రశ్నించారని తెలిసింది. టీడీపీలో అన్యాయం జరగదని, మంచి భవిష్యత్ వుంటుందని ఆమెకు నచ్చచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఇక్కడి నుంచి బరిలో దించడానికి వైసీపీకి చెందిన ఓ దళిత ఎమ్మెల్యేను టీడీపీ సిద్ధం చేసుకుంది. అందుకే డాక్టర్ హెలెన్‌ను పక్కన పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌లో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప, డాక్టర్ హెలెన్‌కు సత్యవేడు టికెట్ దక్కే అవకాశాలు ఏ మాత్రం లేవని టీడీపీ వర్గాలు చెప్పడం గమనార్హం.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా