గుట్కా అక్రమ రవాణా కేసులో అత్యంత సంపన్న నటుడు , నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి ముంబయ్‌కి చేరుకున్న ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. హిందీలో అత్యంత సంపన్న నటుల్లో సచిన్ జోషి ఒకడిగా గుర్తింపు పొందాడు. గుట్కా వ్యాపారంలో రాటుదేలాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు.
ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత గుట్కాల తయారీ, సరఫరాను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. నిందితుల విచారణలో సచిన్ జోషి పేరు బయటకు వచ్చింది. ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ పోలీసులు తెలంగాణకు తరలించారు.
కాగా గుట్కా వ్యాపారంలో అక్రమంగా భారీగా సంపాదించి జల్సాలు చేయడంతో పాటు ఆ డబ్బుతోనే సినిమాలు చేస్తున్నారని సమాచారం. ‘మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, ఆజాన్, జాక్‌పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్ చిత్రాల్లో సచిన్ జోషి నటించాడు.
అక్రమ సంపాదనతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న హిందీ అత్యంత సంపన్న నటుడి పాపం ఎట్టకేలకు పండిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సచిన్ జోషి అరెస్ట్ భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.