cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బిగ్‌బాస్ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన సూర్య‌కిర‌ణ్‌

బిగ్‌బాస్ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన సూర్య‌కిర‌ణ్‌

క‌రోనా విప‌త్కాలంలోనూ బిగ్‌బాస్ సీజ‌న్‌-4 ప్రారంభమైంది. అంతేకాదు రియాల్టీ షో నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కూడా అయ్యాడు. బిగ్‌బాస్ షోకు సంబంధించి కేవ‌లం కొంత మందిని మాత్రమే ఎక్కువ‌గా చూపిస్తార‌నే ప్ర‌చారం మొద‌టి నుంచి ఉంది. మ‌రీ ముఖ్యంగా గ‌త సీజ‌న్‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీ‌ముఖిని ఎక్కువ‌గా చూపిస్తున్నార‌ని, దీని వెనుక మ‌త‌ల‌బు ఉంద‌నే విమ‌ర్శ‌లు కూడా లేక‌పోలేదు.

తాజాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సూర్య‌కిర‌ణ్ షో గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. అస‌లు తానెందుకు రియాల్టీ షోలో పాల్గొనాల‌ని అనుకున్నాడో, అక్క‌డ ఎలా ఉంటారో, త‌న‌కే ఫీలింగ్ క‌లిగిందో త‌దిత‌ర అనేక విష‌యాల‌పై ఆయ‌న నిర్మొహ‌మాటంగా చెప్పారు.

‘సత్యం’ సినిమా హిట్టయిన తర్వాత తాను హైదరాబాద్‌లోనే ఉన్న‌ట్టు చెప్పాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాన‌ని, వ్యక్తిగత కారణాలతో చెన్నై వెళ్లిపోయాన‌న్నాడు. స‌రిగ్గా ఆ స‌మ‌యంతో దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌న‌పై ఓ దుర్వార్త ప్ర‌చార‌మైంద‌న్నాడు. తాను చనిపోయాననే వార్త చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్టు చెప్పాడు. త‌న‌పై ఇలాంటి చెడు స‌మాచారం ప్ర‌చారం అవుతున్న నేప‌థ్యంలో, దానికి స‌మాధానం సినిమాతో చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపాడు.

ఓ సినిమా డైరెక్ట్‌ చేద్దామని ప్లాన్‌ చేసుకుని, ఉగాదికి షూటింగ్‌ మొదలుపెడదామని ప‌క్కాగా అన్నీ సిద్ధంగా చేసుకున్న‌ట్టు తెలిపాడు. అయితే క‌రోనా దెబ్బ‌తో అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులైన‌ట్టు సూర్య‌కిర‌ణ్ చెప్పుకొచ్చాడు.  ఈ టైమ్‌లో బిగ్‌బాస్‌ ఆఫర్ వచ్చిన‌ట్టు అత‌ను వెల్ల‌డించాడు.  అతిపెద్ద  ప్లాట్‌ఫామ్‌తో బిగ్‌బాస్‌తో త‌న ఉనికి కాపాడుకోవ‌చ్చే ఆలోచ‌న‌తో రియాల్టీ షోలో పాల్గొన్న‌ట్టు సూర్య‌కిర‌ణ్ తెలిపాడు.  

అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో  మూడు నాలుగు వారాలు ఉంటాన‌నుకున్న‌ట్టు తెలిపాడు. కానీ ఉన్న ఆ  వారం రోజులు ఓ కొత్త అనుభూతిని అనుభవించిన‌ట్టు తెలిపాడు. టీచ‌ర్ లేని స్కూల్ ఎలా ఉంటుందో బిగ్‌బాస్ కూడా అలా ఉంటుంద‌ని చెప్పాడు. అలాగే   ఏడేళ్లపాటు పెద్ద గ్యాప్‌ వచ్చింద‌ని, దాన్ని పూడ్చుకోడానికి బిగ్‌బాస్‌కి వెళ్లిన‌ట్టు తెలిపాడు. స్టార్‌మా వాళ్లు ఇచ్చే రూ.50 లక్షల ప్రైజ్‌మనీ కోసం వెళ్ల‌లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో మంచి విషయాలు చెబితే వినిపించుకునేవాళ్లు లేర‌న్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో త‌న‌కు ప్రతి రోజూ చాలా భారంగా గడిచేద‌న్నాడు.  ఒక్క అమ్మ రాజశేఖర్‌ తప్ప హౌస్‌లో పెద్దగా సినిమావాళ్లెవరూ లేరన్నాడు. వాళ్లంద‌రికి బిగ్‌బాస్ మంచి వేదిక అవుతుంద‌న్నాడు.

ఆ హౌస్‌లో కంటెస్టెంట్ల చ‌ర్య‌లు చాలా కృత్రిమంగా ఉంటాయ‌న్నాడు. వాళ్ల న‌వ్వు కూడా స‌హ‌జంగా వ‌చ్చేది కాద‌న్నాడు. ఎప్పుడూ బిర్యానీని చూడనట్లు వింత‌గా ప్ర‌వ‌ర్తించేవార‌న్నాడు. వర్షం పడుతుంటే అబ్బబ్బా.. వర్షం అంటుంటారని...ఇవ‌న్నీ త‌న‌కు ఆర్టిఫిషియ‌ల్‌గా అనిపించేవని సూర్య‌కిర‌ణ్ తెలిపాడు.

హౌస్‌లో ఉన్నవాళ్లంతా త‌న‌కన్నా చాలా తెలివిగలవాళ్లన్నాడు. త‌న‌కు అన్ని తెలివితేట‌లు లేవ‌న్నాడు. అన్నిటికి మించి షోలో ఎక్కువ‌గా క‌నిపించ‌డానికి ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుస‌న్నాడు. ఓవర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఉంటేనే ఫుటేజ్ ప్ర‌సారం చేస్తార‌ని తెలియ‌డం వ‌ల్లే,  వాళ్లంతా అలా చేస్తారేమో అని త‌న‌కు అనిపించింద‌న్నాడు. మొత్తానికి బిగ్‌బాస్ షో ర‌హ‌స్యాన్ని వారం రోజులకే సూర్య‌కిర‌ణ్ ప‌సిగ‌ట్టి .... ప్ర‌తి అంశంపై విపులంగా వివ‌రించాడు. 

నిఖిల్ ఎలా ఉన్నాడో రెండేళ్లు చూసి అప్పుడు పెళ్లి చేసుకుంటా 

 


×