బీజేపీ చిత్త‌శుద్ధికి జ‌గ‌న్ ప‌రీక్ష‌

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ బండారం ఏంటో బ‌ట్ట‌బ‌య‌లు అయ్యే స‌మ‌యం వ‌చ్చింది. రాజ‌ధాని అమ‌రావ‌తి, జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం నిర్మాణంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ప్ర‌ధాని మొద‌లుకుని,…

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ బండారం ఏంటో బ‌ట్ట‌బ‌య‌లు అయ్యే స‌మ‌యం వ‌చ్చింది. రాజ‌ధాని అమ‌రావ‌తి, జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం నిర్మాణంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ప్ర‌ధాని మొద‌లుకుని, కిందిస్థాయి బీజేపీ నేత‌లు వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ తీవ్ర‌స్థాయిలో ఆరోపించారు.

అంతెందుకు, అధికారంలోకి వ‌చ్చి ఏడాదిపైన అవుతున్నా ఇంత వ‌ర‌కూ టీడీపీ పాల‌న‌లోని అవినీతిపై విచార‌ణ చేప‌ట్ట‌లేద‌ని ప‌దేప‌దే బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ చిత్త‌శుద్ధికి ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఓ ప‌రీక్ష పెట్టారు. పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభాన్ని పుర‌స్క‌రించుకుని త‌న పార్టీ ఎంపీల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా కొన్ని కీల‌క అంశాల‌కు సంబంధించి కేంద్రంపై తీసుకురావాల్సిన ఒత్తిడిపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. 

సీఆర్‌డీఏ ప‌రిధిలో వేలాది ఎక‌రాల్లో భూకుంభ‌కోణం, రికార్డుల తారుమారు, అలాగే ఏపీ స్టేట్ పైబ‌ర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్‌)లో అంతులేని అవినీతిపై నిజానిజాల‌ను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచార‌ణ జ‌రిపించేందుకు కేంద్రాన్ని గ‌ట్టిగా డిమాండ్ చేయాల‌ని ఎంపీల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

ఈ రెండు కుంభకోణాలపై  సీబీఐ దర్యాప్తు చేయాల‌ని గ‌తంలో వైసీపీ ఎంపీలు కోరారు. అయితే నెలల తరబడి కేంద్రం కాల‌యాప‌న చేస్తున్న నేప‌థ్యంలో, ఈ పార్లమెంటు సమావేశాల్లో దానిపై గట్టిగా నిలదీయాలని పార్టీ ఎంపీల‌ను జ‌గ‌న్ ఆదేశించారు. 

చంద్ర‌బాబు అవినీతిపై భార‌తీయ జాతీయ పార్టీ కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా?  లేక కార్యాచ‌ర‌ణ‌కు దిగుతుందా అనేది తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఎంత‌సేపూ మాట‌లే త‌ప్ప బీజేపీ ప్ర‌భుత్వం చేత‌ల‌కు ప‌ని చెప్పేదెప్పుడు అనే ప్ర‌శ్న వైసీపీ నుంచి గ‌ట్టిగా వినిపిస్తోంది.