థియేటర్లను వదిలేసారా?

టికెట్ రేట్లను తగ్గిస్తూ ఆంధ్ర ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చిన దగ్గర నుంచి చాలా మందికి ఓ సందేహం వచ్చింది. దీనిపైన కోర్టుకు వెళ్ల వచ్చు కదా? అని. కానీ ఎగ్జిబిటర్లు అంత త్వరగా…

టికెట్ రేట్లను తగ్గిస్తూ ఆంధ్ర ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చిన దగ్గర నుంచి చాలా మందికి ఓ సందేహం వచ్చింది. దీనిపైన కోర్టుకు వెళ్ల వచ్చు కదా? అని. కానీ ఎగ్జిబిటర్లు అంత త్వరగా కోర్టుకు వెళ్లలేదు. థియేటర్ల గుట్టు ప్రభుత్వం దగ్గర వుండడమే కారణం అని, అందుకే సినిమా పెద్దలు ఆ దిశగా చొరవ చూపకుండా కాపు కాసుకుంటూ వచ్చారని వార్తలు వినిపించాయి.

కానీ మొత్తానికి వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. పాత రేట్లు అమలు చేసుకునే అవకాశం వచ్చింది. అయినా కూడా చాలా మంది కోర్టు ఆదేశాలు వున్నా కూడా అమలు చేయడం లేదు. అమలు చేస్తామని జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేయడం లేదు. కొంతమంది అలా చేస్తే ముందుగా అధికారులు థియేటర్ రికార్డులు అడుగుతున్నారని తెలుస్తోంది.

అక్కడే వస్తోంది అసలు సమస్య. చాలా థియేటర్లు నిబంధనల మేరకు నడవడం లేదు. కానీ ఏళ్లకు ఏళ్లుగా అధికారులు ఈ అరాచకాన్ని చూసీ చూడనట్లు వదిలేసారు. లైసెన్స్ లు రెన్యువల్ లేకపోయినా, సేఫ్టీ వ్యవహారాలు సరిగ్గా లేకపోయినా, ఆ లైసెన్స్  ఫీజులు కట్టకపోయినా, ఇలా చాలా విషయాలను గాలికి వదిలేసారు.

అసలు థియేటర్ల దగ్గర కట్టడిచేస్తే, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని నట్టి కుమార్ లాంటి వాళ్లు గతంలో చాలా సార్లు ప్రెస్ మీట్ లు పెట్టి గోల గోల చేసారు. అప్పట్లో అది ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు థియేటర్ల లొసుగులు అన్నీ బయటకు వస్తున్నాయి.

కొన్ని థియేటర్లు రికార్డులు వ్యవహారాలు బయటకు వస్తాయని, రేట్ల జోలికి వెళ్లకుండా సైలంట్ అవుతున్నాయి. కొన్ని థియేటర్లు అయితే అసలు మూసేసుకుని కూర్చుంటున్నాయి. మొదటి నుంచి ఎగ్జిబిటర్ సెక్టార్ పెద్దలు ఈ పరిస్థితిని ఊహిస్తూనే వస్తున్నారు. అందుకే కోర్టు మెట్లు ఎక్కకూడదని తమ సభ్యులను కోరుకుంటూ వచ్చారు.  కానీ ఇప్పుడు అనుకున్నంతా అయ్యింది.

ఇప్పుడు చేయాల్సింది థియేటర్లు అన్నీ నిబంధనలకు అనుగుణంగా మారడం తప్ప మరోటి కాదు. ఇన్ని కోట్లు ఖర్చు చేసి థియేటర్లు అభివృద్ది చేసాం అనే ఎగ్జిబిటర్లు ప్రభుత్వ నిబంధనలు, లైసెన్స్ ల విషయం లో కూడా కచ్చితంగా వుంటే ఇక ఏ సమస్య వుండకపోవచ్చు.