స్వామీజీ అవ‌తార‌మెత్తిన వైసీపీ ఎమ్మెల్యే

విశాఖ‌ప‌ట్నం జిల్లా ఎల‌మంచిలి వైసీపీ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు) స్వామీజీ అవ‌తారం ఎత్తారు. నుదుట విభూది, న‌ల్ల‌టి అద్దాలు, కాషాయ దుస్తులు, మెడ‌లో రుద్రాక్షమాల‌. ఆయ‌న స‌న్యాసి అయిపోయారు. ఇంత‌కూ ఆయ‌న కొత్త జీవ‌న మార్గం…

విశాఖ‌ప‌ట్నం జిల్లా ఎల‌మంచిలి వైసీపీ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు) స్వామీజీ అవ‌తారం ఎత్తారు. నుదుట విభూది, న‌ల్ల‌టి అద్దాలు, కాషాయ దుస్తులు, మెడ‌లో రుద్రాక్షమాల‌. ఆయ‌న స‌న్యాసి అయిపోయారు. ఇంత‌కూ ఆయ‌న కొత్త జీవ‌న మార్గం ఎంచుకున్నార‌ని అనుకుంటే మాత్రం త‌ప్పులో కాలేసిన‌ట్టే.

జ‌గ‌న్ ప‌రిపాల‌న‌పై జ‌నాభిప్రాయం తెలుసుకునేందుకు ఆయ‌న మారువేషం క‌ట్టారు. మారువేషంలో త‌న ప్ర‌భుత్వ పాల‌న‌పై ఆరా తీయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అచ్యుతాపురం మండ‌ల కేంద్రంతో పాటు ఆవ‌సోమ‌వ‌రం, అప్ప‌న్న‌పాలెం గ్రామాల్లో కూడా ఆయ‌న ప‌ర్య‌టించారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాలపై ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరు బాగుంద‌ని, ఎలాంటి రాజ‌కీయ సిఫార్సులు లేకుండానే అర్హుల‌కు పథ‌కాలు అందుతున్నాయ‌ని జ‌నం చెప్పారు. అయితే నిత్యావసర ధరలు, విద్యుత్‌ చార్జీలు అధికంగా ఉన్నాయని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రోడ్లు మ‌ర‌మ్మ‌తుకు నోచుకోవ‌డం లేద‌ని, ఓటీఎస్ ప‌థ‌కంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అనంత‌రం ఆయ‌న‌ తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ కృష్ణల వద్దకు మారువేషంలోనే వెళ్లారు. త‌న దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన స‌మ‌స్య‌ల‌ను అధికారుల‌కు వివ‌రించారు. ఎప్పుడూ లేని విధంగా ఓ స‌న్యాసి ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని త‌మ దృష్టికి తీసుకురావ‌డంపై ఆశ్చ‌ర్య‌పోయిన త‌హ‌శీల్దార్ …ఇంతకూ మీరెవరు స్వామీజీ అంటూ ప్ర‌శ్నించారు. 

అప్పుడు  వేషం తొలగించిన ఎమ్మెల్యే అస‌లు స్వ‌రూరం బ‌య‌ట‌ప‌డ‌డంతో త‌హ‌శీల్దార్ ఆశ్చర్య పోయారు. ఇదిలా వుండ‌గా ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్ప‌డం గ‌మ‌నార్హం.