ఆ పుకారే నిజమైంది.. న్యూఇయర్ వేడుకలపై వేటు

డిసెంబర్ 31, జనవరి 1 ఈ రెండ్రోజులు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారంటూ ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తిదేనంటూ కొంతమంది కొట్టిపారేశారు. బిజినెస్ వర్గాలను దెబ్బతీసే కుట్ర…

డిసెంబర్ 31, జనవరి 1 ఈ రెండ్రోజులు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారంటూ ఇటీవల సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తిదేనంటూ కొంతమంది కొట్టిపారేశారు. బిజినెస్ వర్గాలను దెబ్బతీసే కుట్ర అంటూ తేల్చేశారు. కానీ కర్నాటక ప్రభుత్వం దాన్ని నిజం చేసింది. ఆ రెండ్రోజులకు మరో రెండ్రోజులు కలిపి మొత్తం నాలుగు రోజులపాటు ఆంక్షలు విధించింది. వేడుకలపై వేటు వేసింది.

డిసెంబర్ 30 నుంచి జనవరి 2వతేదీ వరకు కర్నాటకలో బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో జరిగే పార్టీలు, ఫంక్షన్లపై నిషేధం విధిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశాలిచ్చారు. క్లబ్బులు, పబ్బుల్లో కనీసం డీజేకి కూడా అనుమతిచ్చేది లేదన్నారాయన. 100 మంది హాజరయ్యే అవకాశం ఉన్న చోట 50మందితో పార్టీ చేసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. అయితే భౌతిక దూరం పేరుతో ఆంక్షలు పెడితే న్యూ ఇయర్ మజా ఏముంటుందంటూ బెంగళూరు యువత దిగాలు పడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకటనే తరువాయి..

ఇప్పటికే ఒమిక్రాన్ భయంతో తెలంగాణ అల్లాడిపోతోంది. దేశవ్యాప్తంగా అత్యథిక ఒమిక్రాన్ కేసులున్న తొలి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ పేరు కూడా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటికే టోలిచౌకిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు, మిగతా ప్రాంతాల్లో కూడా అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. 

ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల పేరుతో ఒమిక్రాన్ కి స్వాగతం చెప్పడం కంటే ముందుగానే వాటిపై నిషేధం విధిస్తే మేలని భావిస్తున్నాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. ప్రకటన విషయంలో కూస్త ముందూ వెనకా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ముందుగానే ప్రకటన ఇవ్వడంతో, మిగతా రాష్ట్రాలు కూడా అదే బాటలో ముందుకెళ్లాలనుకుంటున్నాయి.

కేంద్రం ఫస్ట్ వార్నింగ్ బెల్..

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో అటు కేంద్రం కూడా అప్రమత్తం అయింది. రాష్ట్రాల్లో వార్ రూమ్ లు సిద్ధం చేయాలని, కఠిన నిర్ణయాలు తీసుకోడానికి రెడీగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. అంటే నేరుగా కేంద్రం లాక్ డౌన్ విధించదు కానీ, రాష్ట్రాలే తమకు తాము స్వీయ నియంత్రణ పాటించేలా ఆదేశాలిస్తోంది. తమకి తామే ఆంక్షలు పెడితే.. సాయం కోసం ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్న కేంద్రం.. ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టేసింది.

మొత్తమ్మీద పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటాయనే విషయం అర్థమవుతోంది. వారం రోజుల ముందుగానే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కొత్త సంవత్సరం వస్తూ వస్తూనే కష్టాలు వెంటబెట్టుకొస్తోందని భావించాల్సిందే.