నా పేరు లోకేష్.. నన్ను కాస్త గుర్తించండి ప్లీజ్

రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా నారా లోకేష్ పట్టించుకోవడం లేదు. ఆమధ్య శవరాజకీయాల కోసం పర్యటనలు చేశారు కానీ, ఇప్పుడు అది కూడా లేదు. అసలు పార్టీలో ఏం జరుగుతున్నా ఆయనకి అవసరం లేదు.…

రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా నారా లోకేష్ పట్టించుకోవడం లేదు. ఆమధ్య శవరాజకీయాల కోసం పర్యటనలు చేశారు కానీ, ఇప్పుడు అది కూడా లేదు. అసలు పార్టీలో ఏం జరుగుతున్నా ఆయనకి అవసరం లేదు. ఆయన ఫోకస్ అంతా మంగళగిరిపైనే ఉంది. తాజాగా మంగళగిరిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న లోకేష్.. తననెవరూ గుర్తించడంలేదని తెగ ఇదైపోతున్నారు. పర్యటనలతో పాటు.. అధికార పక్షాన్ని రెచ్చగొట్టే పని మొదలుపెట్టారు.

మంగళగిరిలో టీడీపీని ఖాళీ చేయాలని వైసీపీ చూస్తోందట. టీడీపీ నుంచి వైసీపీలో చేరాలని బెదిరిస్తున్నారట. వారి ఇళ్లు పడగొట్టేస్తామని హెచ్చరిస్తున్నారట. తన క్యాడర్ ని అంతా వైసీపీవైపు లాగేసుకోవాలనుకుంటున్నారట. ఇవీ లోకేష్ ఆరోపణలు. ఆక్రమణల తొలగింపులో భాగంగా ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలోని పెదవడ్లపూడి, పేరకలపూడి గ్రామాల్లో కొన్ని ఇళ్లను అధికారులు తొలగించారు. వారికి జగనన్న ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఏదో ఘోరం, నేరంలాగా లోకేష్ అక్కడ వాలిపోయారు. వారంతా టీడీపీ సానుభూతిపరులని అందుకే ఇళ్లు తొలగించారని మండిపడ్డారు. తాను మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని, గెలిచాక పక్కా ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

లోకేష్ కి అంత సీన్ ఉందా..?

2019లో లోకేష్ మంత్రి హోదాలో ఉండి పోటీ చేసినప్పుడే అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డిని అడ్డుకోలేకపోయారు, ఇక ఇప్పుడు అధికారం కోల్పోయి, ఉన్న ఎమ్మెల్సీ సీటు కూడా పోయిన తర్వాత లోకేష్ అక్కడ చేసేదేముంది. అసలక్కడ టీడీపీకి క్యాడరేలేనప్పుడు ఇక వైసీపీ బలవంతం పెట్టి చేర్చుకోడానికి ఎవరున్నారు..?

కానీ లోకేష్ కి మాత్రం అక్కడ ఐడెంటిటీ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే ముందుగానే భుజాలు తడుముకుంటున్నారు. తమ కార్యకర్తల్ని లాగేసుకుంటున్నారంటూ బాధపడుతున్నారు.

మంగళగిరిని హైలెట్ చేసేందుకే..?

ఎన్నికలకు రెండేళ్లుండగానే నియోజకవర్గాన్ని తనకు తానే ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగారు నారా లోకేష్. ఇప్పటినుంచే అక్కడ అందరినీ మంచి చేసుకోవాలనుకుంటున్నారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను బహూకరించారు, ప్రతి టీకొట్టు దగ్గర ఆగి పలకరిస్తున్నారు, చేనేత వర్గాల ఇంట్లోకి వెళ్లి మగ్గం నేస్తానంటున్నారు.. ఇలా రకరకాల విన్యాసాలు చేస్తున్నారు లోకేష్.

అయితే అవి సరిపోవడంలేదని, ఇప్పుడిలా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తమ్మీద లోకేష్ సక్సెస్ ఫుల్ గా మంగళగిరికే పరిమితం అయిపోవడం విశేషం. చంద్రబాబు కూడా అదే కోరుకుంటున్నారు. లోకేష్ కి ఏదో ఒక టాస్క్ అప్పగించి ఆయన్ని పక్కనపెట్టేసి, పార్టీ వ్యవహారాలన్నీ తానే చూసుకుంటున్నారు.