ఏపీపై దుష్ప్ర‌చారం చేసే వారికి కేంద్రం షాక్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితిపై దుష్ప్ర‌చారం చేసే ప్ర‌తిప‌క్షాల‌కు, వాటిని మోసే మీడియా సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఏపీలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీని విధించాలంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్న వాళ్లు నిన్న రాజ్య‌స‌భ‌లో కేంద్ర…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితిపై దుష్ప్ర‌చారం చేసే ప్ర‌తిప‌క్షాల‌కు, వాటిని మోసే మీడియా సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. ఏపీలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీని విధించాలంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్న వాళ్లు నిన్న రాజ్య‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి ఇచ్చిన స‌మాచారాన్ని తెలుసుకోవాలి.

రాజ్య‌సభ‌లో బీజేపీ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి కీల‌క స‌మాచారం ఇచ్చారు. ఏపీకి సొంత వ‌న‌రుల నుంచి ఆదాయం పెద్ద‌గా త‌గ్గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.  గ‌త ఆరు బ‌డ్జెట్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం సొంత ప‌న్ను, ప‌న్నేత‌ర మార్గాల నుంచి మొత్తం రూ.4,76,741 కోట్లు ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేయ‌గా రూ.3,31,531 కోట్లు ఆదాయం వ‌చ్చింద‌న్నారు. గ‌త ఆరేళ్ల‌లో స‌గ‌టున అంచ‌నాల్లో 69.54% ఆదాయం వ‌చ్చిన‌ట్టు ఆయన తెలిపారు.

గ‌త మూడేళ్ల‌లో రాష్ట్ర సొంత వాస్త‌వ ఆదాయం రూ.60 వేల కోట్ల‌ను దాటింద‌న్నారు. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో గ‌రిష్టంగా రూ.62,427 కోట్లు రాగా, 2019-20లో రూ.60,916 కోట్లు, 2020-21లో రూ.60,687 కోట్లు వ‌చ్చింది. క‌రోనా కార‌ణంగా రాష్ట్రాల ఆదాయం భారీగా త‌గ్గింద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ  2019-20, 2020-21 మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ సొంత ఆదాయ వ‌న‌రుల్లో రూ.229 కోట్ల త‌గ్గుద‌లే క‌నిపించిందని కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ మంత్రి చెప్ప‌డం విశేషం.

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం అంటే చంద్ర‌బాబు హ‌యాం. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, దుర‌దృష్ట‌వ‌శాత్తు క‌రోనా మ‌హమ్మారి పంజా విసిరింది. దీని వ‌ల్ల ప్ర‌పంచ‌మంతా ఆర్థికంగా దారుణ ప‌రిస్థితులు నెల‌కున్నాయి. క‌రోనా ఫ‌స్ట్‌, సెకెండ్ వేవ్‌లు వ‌రుస‌గా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఎలా త‌ల‌కిందులు చేశాయో అంద‌రికీ తెలిసిందే. అయితే అంత‌టి క‌ష్ట‌కాలంలోనూ 2019-20, 2020-21 మ‌ధ్య ఏపీ సొంత ఆదాయ వ‌న‌రుల్లో రూ.229 కోట్ల త‌గ్గుద‌లే క‌నిపించ‌డం రాష్ట్రానికి శుభ ప‌రిణామం. కానీ సంక్షేమ ప‌థ‌కాలు మ‌రీ ఎక్కువ కావ‌డం, ప్లానింగ్ లోపించ‌డం వ‌ల్ల ఆర్థిక ఇబ్బందుల‌ను ప్ర‌భుత్వం ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.