జీవితం సాఫీగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో ఓ కుదుపు. దీని నుంచి మీడియాతో పాటు సమాజం నుంచి ఎదురవుతున్న ఛీత్కారాలతో సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి కలత చెందారు. అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని మార్కెట్ చేసుకుంటున్నారనే ఆరోపణలపై శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారి రాజ్‌కుంద్రాను గత నెల 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. తన భర్త అరెస్ట్, అనంతర పరిణామాలపై సోమవారం ట్విటర్ వేదికగా తన ఆవేదనను శిల్పాశెట్టి పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలు సృష్టించొద్దని ఆమె మీడియాకు హితవు చెప్పారు. ఇంకా అనేక ముఖ్య విషయాలున్న శిల్పాశెట్టి ట్వీట్ గురించి తెలుసుకుందాం.
‘గత కొన్నిరోజలుగా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. రాజ్‌కుంద్రా అరెస్ట్ వ్యవహరంపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకూ నేను అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉన్న కారణంగా ఆ విషయంపై నేను మాట్లాడాలని భావించడం లేదు. ముంబయి పోలీసులు, భారత న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక తల్లిగా నా పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నా గురించి అసత్య ప్రచారాలు చేయకండి. నా పేరుతో ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రచారం చేయకండి’ అని శిల్పాశెట్టి చెప్పుకొచ్చారు.
ఈ ట్విటర్ ప్రకటనతో ఆమె ఎంత మానసిక వేదనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ఊరికే అనలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.