సరిగ్గా వారం రోజుల్లో కల్కి సినిమా థియేటర్లలోకి రాబోతోంది. దీంతో ఈ వారం బాక్సాఫీస్ బోసిపోతుందని అంతా భావించారు. కానీ దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
ఇట్లు మీ సినిమా, మరణం, సీతా కల్యాణ వైభోగమే, హనీమూన్ ఎక్స్ ప్రెస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు, ఓ మంచి ఘోస్ట్, అంతిమ తీర్పు, సందేహం, నింద, పద్మవ్యూహంలో చక్రధారి, ఉపేంద్ర-ఏ, ప్రేమకథా చిత్రమ్.. ఇలా 12 చిత్రాలు రేపు, ఎల్లుండి థియేటర్లలోకి వస్తున్నాయి.
వీటిలో హెబ్బా పటేల్ నటించిన సినిమాలు రెండు రిలీజ్ అవుతుండగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించిన చిత్రాలు మరో 2 ఉన్నాయి. ఇక రీ-రిలీజెస్ ఇంకో 2 ఉన్నాయి. హనీమూన్ ఎక్స్ ప్రెస్, సందేహం సినిమాల్లో హెబ్బా పటేల్ నటించింది. ఉపేంద్ర నటించిన సంచలనం చిత్రం ‘ఏ’, సుధీర్ బాబు చేసిన ప్రేమకథా చిత్రమ్ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. వరుణ్ సందేశ్ నటించిన నింద ఓ మోస్తరుగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ వరల్డ్ సినిమా కల్కి వచ్చే వారం రిలీజ్ ఉందని తెలిసి కూడా ఇన్ని సినిమాలు థియేటర్లలోకి రావడం ఆశ్చర్యమే.
టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి డేట్స్ దొరకడం దాదాపు గగనమైపోయింది. పెద్ద సినిమాలన్నీ ముందుగానే కర్చీఫులు వేయడం, షూటింగ్ సకాలంలో పూర్తవ్వకపోతే వాయిదా వేయడం కామన్ అయిపోయింది. అలా అని చిన్న సినిమాలకు దారివ్వడం లేదు. దీంతో ఇలాంటి సినిమాలన్నీ ఒకేసారి క్యూ కడుతున్నాయి.
పైగా ల్యాబ్ లో పెట్టుకున్న కొద్దీ వడ్డీలు వాచిపోతున్నాయి. దీంతో నాన్-థియేట్రికల్ బిజినెస్ తో సంబంధం లేకుండా సినిమాల్ని వదిలించుకుంటున్నారు చిన్న నిర్మాతలు. కల్కి టైమ్ కు ఇవన్నీ థియేటర్ల నుంచి లేచిపోతాయి.