ఈ వారం ట్రేడ్ టాక్: కరోనా భయం

లాక్‌డౌన్ కాస్త కాస్తగా ఎత్తివేస్తూ తొంభై శాతం పనులు తిరిగి ప్రారంభించేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా మళ్లీ మామూలు అయిపోతుందని భావించారు. కానీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు షూటింగ్స్‌కి వచ్చేది…

లాక్‌డౌన్ కాస్త కాస్తగా ఎత్తివేస్తూ తొంభై శాతం పనులు తిరిగి ప్రారంభించేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా మళ్లీ మామూలు అయిపోతుందని భావించారు. కానీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు షూటింగ్స్‌కి వచ్చేది లేదని చాలా మంది నటీనటులు తీర్మానించేసారు. నిర్మాతలు ఎంత మొహమాటపెట్టినా కానీ ససేమీరా అని తేల్చేసారు. 

దీంతో పెద్ద చిత్రాల షూటింగ్స్ సెప్టెంబర్ వరకు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి పర్మిషన్ వచ్చినా కానీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో రావడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది. మాల్స్‌తో పాటు ఇతరత్రా షాపింగ్ అంతా తెరిచినా, రెస్టారెంట్లు రన్ అవుతున్నా కానీ జనం రావడం లేదు. 

కరోనా భయం అంతటా కమ్ముకున్న నేపథ్యంలో సినిమా థియేటర్లకు వచ్చే రిస్క్ చాలా మంది తీసుకోరు. స్కూల్స్, కాలేజెస్ తెరవడానికి పర్మిషన్ ఇచ్చేంత ధైర్యం, నమ్మకం ప్రభుత్వాలకి వస్తే తప్ప పరిస్థితుల పట్ల సగటు జనాలకి నమ్మకం రాదు.

కాబట్టి సినిమాలు మళ్లీ మామూలుగా రన్ అవ్వాలంటే కనీసం సెప్టెంబర్ వరకు వేచి చూడక తప్పదు. ఇండస్ట్రీలో అయితే దసరాకి కొత్త సినిమాలు విడుదలయితే గొప్ప విషయమేనని అంటున్నారు.