బాబు సంజాయషీ ఎందుకోసం?

అడిగితే సమాధానం చెప్పినా, సంజాయషీ ఇచ్చినా ఓ మాదిరిగా వుంటుంది. అడగకుండా చెబితే అదోలా వుంటుంది. ఎందుకు చెప్పినట్లా? అని అనుమానించాల్సి వస్తుంది. మన మాజీ సిఎమ్ చంద్రబాబు వ్యవహారం అలాగే వుంది.  Advertisement…

అడిగితే సమాధానం చెప్పినా, సంజాయషీ ఇచ్చినా ఓ మాదిరిగా వుంటుంది. అడగకుండా చెబితే అదోలా వుంటుంది. ఎందుకు చెప్పినట్లా? అని అనుమానించాల్సి వస్తుంది. మన మాజీ సిఎమ్ చంద్రబాబు వ్యవహారం అలాగే వుంది. 

''….నాకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు పోరాడాను..''….చంద్రబాబు

ఇదీ చంద్రబాబు వున్నట్లుండి,సమయం, సందర్భంగా ఏమీ లేకుడా ఇచ్చిన స్టేట్ మెంట్.  2019 ఎన్నికలు ముగిసి, చంద్రబాబు అధికారం కోల్పోయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ జనాల్లో ఒకటే మథనం. భాజపా అండ లేకుండా పోవడం వల్లనే ఇంత సమస్య వచ్చిందని, ఇప్పుడు కనుక భాజపా అండ వుండి వుంటే జగన్ ను ఓ ఆట ఆఢించే అవకాశం వుండేదని. కానీ 2019 ఎన్నికలకు ముందు, చంద్రబాబు తమ అనుకూల మీడియా తప్పుడు సలహాలు విని, మోడీ మీద నిప్పులు చెరిగారు. 

రాష్ట్రంలో తమ పార్టీ విజయం ఖాయమని, కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం వస్తే, 2014 నుంచి 2019 వరకు పడ్డ పాట్లే పడాల్సి వస్తుందని చంద్రబాబు భావించారు. దేశంలో ఇంతో అంతో మోడీ వ్యతిరేకత వుందని ఆయనకు ఆయనే ఫీలైపోయారు. దాంతో అదేదో సినిమాలో కమెడియన్ వేణుమాధవ్ చెలరేగిపోయినట్లు చెలరేగిపోయారు. ఆంధ్ర ఎన్నికలను వదిలేసి, ఉదయం కలకత్తా, మధ్యాహ్నానికి ముంబాయి, సాయంత్రానికి ఢిల్లీ, కుదరితే మధ్యలో యుపి అంటూ తెగ తిరిగేసారు. 

పోనీ తిరగడం వరకు ఓకె, కానీ విమర్శించడం కూడా హద్దులు దాటేసారు. మోడీ పర్సనల్ వ్యవహారాల వరకు వెళ్లారు. సిద్దాంతాల మేరకు, రాజకీయ నిర్ణయాల మేరకు విమర్శలు చేయడం మానేసారు. ఇక జీవితంలో మోడీతో మొహా మొహాలు చూసుకునేది లేదన్నంతగా చెలరేగిపోయారు. ఇలా జరిగిన బాబుగారి పోరు ఎన్నికల పరాజయంతో ఆగిపోయింది.

అధికారం పోయి ఆర్నెల్లుకాకుండానే మళ్లీ మోడీకి ఎలా దగ్గర కావాలన్న తహతహ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద చూసుకుంటే మోడీకి సరిజోడు అపోజిషన్ కనిపించడం లేదు. ఒకప్పుడు తన వెనుక వుంటారనుకున్న పలు ప్రాంతీయ పార్టీల జనాలు కూడా ఇప్పుడు మౌనం వహించేసారు. దేశం మొత్తం మోడీ పేరు తప్ప మరో నాయకుడి పేరు వినిపించని పరిస్థితి నెలకొంది. 

ఇలాంటి టైమ్ లో మళ్లీ ముచ్చటగా మూడోసారి భాజపాకు దగ్గర కావాలని బాబు ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి అవసరం అయినపుడు భాజపా చెంతకు చేరడం, అక్కరలేనపుడు వదిలేయడం అన్నది తెలుగుదేశం పార్టీకి ఆది నుంచీ అలవాటే. ఇక బాబుగారికి అయితే చెప్పనక్కరలేదు. మోడీ హైదరాబాద్ వస్తే అరెస్టు చేస్తానని ప్రకటన చేసింది ఈ పెద్దాయనే. 

కానీ 2014 ముందు పదే పదే ఢిల్లీ వెళ్లి, భాజపా కేంద్ర నాయకుల చుట్టూ తిరిగి, కొంతమందికి వంగి మరీ దండాలు పెట్టి, మొత్తానికి పొత్తు సంపాదించారు. అంటే ఒకసారి విడాకులు అయ్యాక, మళ్లీ సఖ్యత సాధించారు. కానీ అయిదేళ్లు గడవకుండానే సతాయింపులు మొదలయిపోయాయి. ఆ విధంగా మళ్లీ విడాకులు ఇచ్చేసారు.

కానీ 2019 సగానికి వచ్చేసరికి బాబుగారికి తత్వం బోదపడిపోయింది. మోడీ తప్ప అన్యధా శరణం నాస్తి అన్న దాంట్లో క్లారిటీ వచ్చేసింది. కానీ రాయబారం నడిపేదెవరు. గతంలో కాస్త ఆదుకునే పెద్దాయనను, పెద్ద పోస్ట్ ఇచ్చి మూలన కూర్చోపెట్టారు. ఆయన మాట చెల్లడం లేదు. దాంతో తమ పార్టీ జనాలనే దొడ్డి దారిన భాజపాలోకి అంపకం పెట్టడం ప్రారంభించారు. కానీ దాని వల్ల కూడా పని జరిగేలా కనిపించడం లేదని మరి కొన్నాళ్లకు క్లారిటీ వచ్చేసింది. వెళ్లిన వాళ్లు వాళ్ల పనులు చక్కపెట్టుకున్నారు తప్ప, పార్టీలు రెండింటినీ దగ్గర చేసే పని పెట్టుకోలేదు.

మరోపక్క ఆంధ్రలో జగన్ అనే పరమ మొండివాడి పాలన సాగుతోంది. అమరావతి కలలు నీరుగారిపోయాయి. విశాఖ దిశగా అభివృద్ది ప్రయాణం ప్రారంభమైంది. జనాలకు చేతినిండా నేరుగా ప్రభుత్వం నుంచి డబ్బులు అందడం ప్రారంభమైంది. మళ్లీ వీళ్లంతా తెలుగుదేశం పార్టీ వైపు తిరిగి వస్తారా? తిరిగి చూస్తారా? అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. 

ఇంకో పక్క తెలుగుదేశం పార్టీకి అండగా వున్న సామాజిక వ్యాపార వర్గం దిగాలుపడడం ప్రారంభమైంది. అవసరం అయితే బాబు సారధ్యాన్నై పక్కన పెట్టేస్తారనే గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి. 

మరోపక్క కరోనా విలయం మొదలైంది వ్యాపారాలు కుదేలవుతున్నాయి. అమెరికాలో వున్న మనవాళ్లు కూడా దేశం దిక్కు చూసేపరిస్థితి. ఇలాంటి టైమ్ లో పార్టీని మరో నాలుగేళ్లు నడపడం కష్టం. మరో నాలుగేళ్లు పార్టీ జనాలను నిలబెట్టుకోవడం మరీ కష్టం. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు షార్ట్ కట్ కావాల్సి వచ్చింది.

జేసి దివాకర రెడ్డి చెప్పినట్లు, జగన్ ను నిలవరించడం అన్నది మోడీకి తప్ప మరెవరికి సాధ్యం కాదని బాబుగారికి కూడా అర్థం అయిపోయింది. జగన్ ను ఢిల్లీ వైపు నుంచి నరుక్కురావాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక తాను బింకం వదిలి రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు.

అందులో భాగంగా వచ్చిన స్టేట్ మెంట్ నే, మోడీతో తనకు వ్యక్తిగత విబేధాలు లేవు అన్న స్టేట్ మెంట్. కానీ నిజానికి బాబు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మూడు వంతుల రాజకీయ నాయకుల మధ్య వ్యక్తిగత వైరాలు వుండవు. రాజకీయ అధికార సాధన కారణంగా ఏర్పడే వైరాలే వుంటాయి.  అందుకే విమర్శలు చేసేటపుడు కాస్త జాగ్రత్తగా వుంటారు.

తను జైలుకు పోవడానికి బాటలు వేసిన సోనియా, రాహుల్ ను కూడా జగన్ ఎప్పుడూ గట్టిగా విమర్శించలేదు విమర్శించలేక కాదు, ఏ రోజు పరిస్థితి ఎలా వుంటుందో, ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో రాజకీయాల్లో తెలియదు. కానీ ఎంతో అనుభవం వున్న చంద్రబాబు ఈ గీతను దాటేసి మోడీపై విమర్శల దాడి చేసారు. 

మరి ఇప్పుడు మళ్లీ మోడీ దగ్గరకు రానిస్తారా? తను ప్రధాని కావడానిక వీలు లేదనంతగా గత ఎన్నికల ముందు ప్రచారం చేసిన బాబును మోడీ క్షమిస్తారా? అన్నది అనుమానమే. కానీ ఈ విషయంలో బాబును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అందకపోతే ఏమైనా పట్టుకోవడానికి బాబుగారు రెడీ. చిన్న సైగ రావాలే కానీ ఢిల్లీ వెళ్లి మోడీ ముందు, అమిత్ షా ముందు వాలిపోవడానికి బాబు రెడీ. కానీ ఆ సైగ వచ్చే పరిస్థితి ఇప్పట్లో వుండదు.

ఎందుకంటే ఈ నాలుగేళ్లు బాబుతో అవసరం వుండదు. జగన్ తో వుంటుంది తప్ప. నాలుగేళ్ల తరువాత అప్పటి ప్రజా స్పందన చూసి మోడీ డిసైడ్ అవుతారు ఎవరితో వెళ్లాలా? అన్నది. అప్పుడు కూడా బాబు, జగన్ ల్లో ఎవరు నమ్మదగ్గ నేస్తం అన్నది చూసుకుంటే జగన్ కే మార్కులు పడతాయి. ఎందుకంటే బాబుగారు ఇప్పటికే రెండు సార్లు మోడీకి హ్యాండ్ ఇచ్చారు. జగన్ అలా హ్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఇక్కడ జగన్ వైపే భాజపా వుండడానిక ఎక్కువ అవకాశం వుంది

ఇక్కడ ఇంకో చిన్న సమస్య కూడా వుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే భాజపాతో పొత్తుపెట్టేసుకున్నారు. ఆయన బాబు కు దూరంగా వుంటానని అంటున్నారు. 2014లో బాబుతో అధికారక పొత్తు పెట్టుకోకున్నా, రహస్య పొత్తు వుందీ అంటూ జరిగిన ప్రచారం వల్ల వచ్చిన నష్టం పవన్ కు తెలియంది కాదు. అందువుల్ల భాజపా-తేదేపా కలుస్తాయంటే ముందుగా ఆయనే అంగీకరించరు. 

మరోపక్క తమిళనాడులో భాజపా అమలు చేసిన స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీని మళ్లీ బలపడే అవకాశం భాజపా ఇస్తుందని అనుకోవడానికి లేదు. ఇలా అన్ని విధాలా బాబు-భాజపా బంధం చిగురించడానికి అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఇక తానే రంగంలోకి దిగక తప్పదని బాబుగారు డిసైడ్ అయినట్లున్నారు. దీనికి ఓం ప్రధమంగా ఓ స్టేట్ మెంట్ పడేసారు. దీని మీద వచ్చే రియాక్షన్  చూసి బాబుగారి మలి యాక్షన్ వుంటుంది. కానీ ఈ విషయం తెలిసే ఎవ్వరూ ఆయన స్టేట్ మెంట్ ను పట్టించుకోలేదు. 

మోడీని నేరుగా కలిసే ప్రయత్నం చేసి, శరణు వేడి, పొత్తు కోరడం మినహా బాబుగారికి మరో గత్యంతరం లేదు. కానీ అది ఇప్పుడు కాదు, కనీసం మరో రెండేళ్లు దాటిన తరువాత కానీ సాధ్యం కాదు. అయితే ఆలోగా బాబు పార్టీకి, ఆ పార్టీని నమ్ముకున్న సామాజిక వర్గానికి జగన్ చేయాల్సింత డ్యామేజ్ చేసేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది

చాణక్య
[email protected]