ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్‌కే ఆగడాలు వారం వారానికి శ్రుతి మించుతున్నాయి. ప్రతి వారం ‘కొత్తపలుకు’ పేరుతో రాసే కాలంలో జగన్ తప్ప మరెవరు ఆయనకు కనిపించరు. ఈ వారం ఆయన రాసిన వ్యాసం ‘అరాచకీయం’. ఏపీ ముఖ్యమంత్రి పాలన మొత్తం అరాచకీయమని ఆర్‌కే వ్యాసం సారాంశం. జగన్ పాలన సంగతేమో కానీ, ఆర్‌కే కొత్తపలుకు మాత్రం అరాచకం అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఈ వేళ జగన్ సీఎం అయ్యారు కాబట్టి, ఆయన పాలన గురించి రాసే అవకాశం ఉంది. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనపై ఆర్‌కే కలం నుంచి ఇలాంటి రాతలే వచ్చాయి. ఎక్కడైనా ఓ ప్రతిపక్ష నాయకుడిని టార్గెట్ చేస్తూ ఏళ్లతరబడి వ్యతిరేక వ్యాసాలు, వార్తా కథనాలు రాయడం చూశామా? అది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూస్తున్నాం. ఆ ఘనత కూడా అరాచకానికి, సిగ్గులేని తనానికి నిలువెత్తు రూపమైన ఆర్‌కేకు మాత్రమే దక్కుతుంది.
ఈ రోజు ఆర్‌కే రాసిన వ్యాసంలో మొదటి వాక్యాలనే తీసుకుందాం.
‘తెలుగునాట సరికొత్త రాజకీయ వ్యూహ రచనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి పూనుకున్నారా? నిజానికి ఈ వ్యూహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పాక్షికంగా అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి వ్యతి రేకంగా జరిగే పరిణామాలకు, సంఘటనలకు కేసీఆర్ మీడియాలో చోటు ఉండకపోవడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేక వార్తలకు కేసీఆర్ మీడియాలో అధిక ప్రాధాన్యం లభించేది’
జగన్ సరికొత్త రాజకీయానికి వ్యూహ రచన చేస్తున్నారని, దీన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పాక్షికంగా అమలు చేశారని రాసిన ఆర్‌కే…మరి కేసీఆర్ రాజకీయంపై ఏనాడైనా కొత్త పలుకులో రాశారా? పైపెచ్చు కేసీఆర్ ‘అపర చాణక్యుడు’ అని కీర్తిస్తూ ‘కొత్త పలుకు’ రాయలేదా? జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పరిణామాలపై కేసీఆర్ మీడియాలో చోటు ఉండదని తెగ బాధపడుతున్న ఆర్‌కే…చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగే పరిణామాలపై ఆంధ్రజ్యోతిలో ఏ మాత్రం చోటు కల్పిస్తున్నారో చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? ఒకరిపై వేలెత్తి చూపే ముందు, మిగిలిన నాలుగు వేళ్లు తనవైపు చూపుతున్నాయని ఆర్‌కే గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
జగన్‌ను వ్యతిరేకించే క్రమంలో ఆర్‌కే ఎంతగా దిగజారారంటే ఇంకా కొందరి కబంధ హస్తాల్లోనే రాజకీయం కొనసాగాలని సమర్థించేందుకు కూడా వెనుకాడలేదు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, ఆ జిల్లా రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం ఎప్పటి నుంచో కొనసాగుతోందని, అయినప్పటికీ అనిల్‌కుమార్ యాదవ్‌ను మంత్రిగా తీసుకోవడమే కాకుండా అత్యంత ప్రాధాన్యం జగన్ ఇస్తున్నారని ఆర్‌కే విలవిలలాడాడు.
ఈ వాక్యాల ద్వారా ఆర్‌కే ఏం చెప్పదలచుకున్నాడు? నెల్లూరు జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ కాబట్టి బీసీకి చెందిన అనిల్‌కుమార్ యాదవ్‌కి ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి అని జగన్‌ను ఆర్‌కే ప్రశ్నించదలిచాడా? ఎల్లప్పుడూ నెల్లూరు జిల్లాలో ఆనం వాళ్ల పెత్తనమే సాగాలని ఆర్‌కే ఆకాంక్షిస్తున్నాడా? ఆర్‌కే చెప్పినట్టే జరగాలంటే…ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ దేనికి? మళ్లీ మనం రాచరిక వ్యవస్థలోకి పోతే సరిపోతుంది కదా? అప్పుడు ఎప్పుడూ ఒక సామాజిక వర్గం లేదా ఒకే కుటుంబ పాలనలో జీవిత కాలం బానిసగా బతికే సువర్ణావకాశం దక్కుతుంది. ఆ బతుకునేనా ఆర్‌కే కోరుకునేది. ఇదేం బానిస ఆలోచన ఆర్‌కే?
ఇలాంటివేనా ఒక బాధ్యత గల జర్నలిస్టు రాయాల్సిన రాతలు? బడుగు, బలహీన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం దక్కాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయానికి ఆర్‌కే రాతలు తూట్లు పొడవడం లేదా? జగన్‌పై అక్కసుతో రెడ్ల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి, ఉసిగొల్పాలనే దుష్ట ఆలోచన నుంచే వచ్చిన రాతలుగా వీటిని చూడాలి.
‘కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ వేధింపులను భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా చలామణి అవుతున్న అచ్చెన్నాయుడిపై దృష్టిపెట్టారు. ఈఎస్‌ఐ కుంభకోణం అంటూ అచ్చెన్నను అరెస్ట్ చేశారు’
అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కనీసం కోడెల శివ్రపసాద్‌కు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. అలాగే వర్ల రామయ్యలాంటి మూడో శ్రేణి నాయకులతో కోడెలకు హితవు చెప్పించడం నిజం కాదా? ఎవరి కోసమైతే స్పీకర్‌గా నిబంధనలను తుంగలో తొక్కారో, చివరికి ఆ నాయకుడి నుంచి తిరస్కరణకు గురి కావడంతోనే కోడెల శివప్రసాద్ తట్టుకోలేక పోయారు. అదే ఆయన బలవన్మరణానికి దారి తీసిందని ఎవరినడిగినా చెబుతారు.
ఇక అచ్చెన్నాయుడి విషయానికి వద్దాం. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడి కుటుంబం రాజకీయంగా బలమైంది అయితే…ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నను అరెస్ట్ చేయకుండా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలా? అయినా అవినీతిపై టీడీపీకి పేటెంట్ ఉన్నట్టు, వారేం చేసినా కేసులు పెట్టకూడదని ఆర్‌కే చెప్పదలిచాడా? మరి జగన్ కేసులపై మాత్రం ఇంత సానుకూలంగా ఎందుకు ఆలోచించలేదు.
ఈ వ్యాసంలో జగన్ సర్కార్ వివిధ కారణాలతో కేసులు నమోదు చేసిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప గురించి ప్రస్తావించారు. మరి జేసీ ప్రభాకర్‌రెడ్డిని విస్మరించడం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే జేసీ బ్రదర్స్‌కు తగిన శాస్తి జరిగిందని ఆర్‌కే భావిస్తున్నాడా? గతంలో ఏబీఎన్ చానల్‌ను, ఆంధ్రజ్యోతిని జేసీ దివాకర్‌రెడ్డి తిట్టిపోసిన విషయాన్ని మనసులో పెట్టుకుని, కావాలనే వారిని విస్మరించాడా? ఇదెక్కడి న్యాయం ఆర్‌కే?
ఆర్‌కే వ్యాసంలో అత్యంత అభ్యంతరకరం, సంస్కార హీనమైన వాక్యాలు ఏంటంటే…జగన్ సతీమణి భారతిని తెరపైకి తేవడం. జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన భార్య భారతిరెడ్డి ఒక పోలీస్‌పై చేయి చేసుకోవడాన్ని టీవీలో చూశామని ప్రస్తావించారు. ఆర్‌కే సంస్కారం ఏంటో భారతి గురించి రాయడంలోనే అర్థం చేసుకోవచ్చు.
‘ముఖ్యమంత్రిగా జగన్ నుంచి ఎదురవుతున్న సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చాలెంజ్‌గా మారింది. సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడిన తెలుగుదేశం పార్టీకి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ తరహా గెరిల్లా దాడులను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను మదింపు చేసుకుని తెలుగుదేశం పార్టీ తమ సిలబస్‌ను మార్చుకోవలసిన అవసరముంది’
అబ్బో…జగన్‌ను ఎదుర్కొనే చిట్కాలను చంద్రబాబుకు ఆర్‌కే చెబుతున్నాడు. పాపం చంద్రబాబుకు ఏమీ తెలియక అమాయకంగా ఏడుస్తూ కూచున్నాడని ఆర్‌కే కన్నీటి పర్యంతమవుతున్నాడు. జగన్ గెరిల్లా దాడులను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ సిలబస్‌ను మార్చుకోవాలని ఆర్‌కే సలహాలిస్తున్నాడు. గతంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా బాబుకు ఆర్‌కే ఇలాంటి సలహాలే ఇచ్చాడు. ఆర్‌కే మాటలు నమ్మి బాబు శంకరగిరి మాన్యాలు పట్టాడు. కనీసం మంగళగిరి నుంచి కొడుకును కూడా బాబు గెలిపించుకోలేక పోయాడు.
కౌరవుల వినాశనానికి శకుడు ప్రధాన పాత్ర పోషించినట్టుగానే….టీడీపీ మట్టికొట్టుకు పోవడానికి ఆర్‌కే శకునిపాత్ర పోషిస్తున్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఈ విద్వేష, విధ్వంసకర, విషపూరిత రాతలు. ఆర్‌కే అజ్ఞానం, అరాచకం, అహంకారం వర్ధిల్లు గాక. వినాశకాలే విపరీత రాతలంటే ఇలాంటివేనేమో!
-సొదుం