అరకొరగా తగ్గిన టికెట్ రేటు.. ఇది కదా దోపిడీ అంటే..!

ప్రభుత్వం అనుమతిచ్చింది కాబట్టి దొరికినకాడికి దోచుకోవడమే. ఇండస్ట్రీ ఏమౌతుంది..? తాము తీసుకునే నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? అసలు తమ సినిమా ఎన్ని రోజులు నిలబడుతుంది..? ఇవేం అక్కర్లేదు. ఆ రోజుకు…

ప్రభుత్వం అనుమతిచ్చింది కాబట్టి దొరికినకాడికి దోచుకోవడమే. ఇండస్ట్రీ ఏమౌతుంది..? తాము తీసుకునే నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? అసలు తమ సినిమా ఎన్ని రోజులు నిలబడుతుంది..? ఇవేం అక్కర్లేదు. ఆ రోజుకు టికెట్ రేట్లు పెంచుకున్నామా లేదా? అందినకాడికి దోచుకున్నామా లేదా? ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంది సినీ పరిశ్రమ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది అర్జున ఫల్గుణ సినిమా.

ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును వినియోగించుకొని ఈ సినిమాకు మొదటి రోజు 295 రూపాయల టికెట్ పెట్టేశారు. అసలు శ్రీవిష్ణు సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, ఈ స్థాయిలో టికెట్ రేటు పెడితే ప్రేక్షకులు వస్తారా అనే ఆలోచన కూడా లేకుండా ఫిక్స్ చేశారు. దీనిపై చాలా విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియాలో చాలామంది దుమ్మెత్తిపోశారు.

దీనికి తోడు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. అర్జున ఫల్గుణ ఏమాత్రం బాగాలేదంటూ రివ్యూలు పడ్డాయి. ఇలాంటి టైమ్ లో మేకర్స్ ఏం చేయాలి? ఉన్నఫలంగా టికెట్ రేట్లు తగ్గించాలి. మరింత మంది ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. కానీ వరుసగా రెండో రోజు కూడా తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు తగ్గించలేదు.

హైదరాబాద్ లోని దాదాపు చాలా మల్టీప్లెక్సుల్లో ఫ్లాట్ రేట్లు కొనసాగిస్తున్నారు. రీక్లెయినర్స్ ను 350 రూపాయలు చేసి, మిగతా అన్ని సీట్లను ఫ్లాట్ 295 రూపాయలకు అమ్ముతున్నారు. ఉన్నంతలో ఏషియన్ గ్రూప్ కు చెందిన మల్టీప్లెక్సుల్లో మాత్రం టికెట్ రేటును సగటున 175 రూపాయలు పెట్టారు. మిగతా మల్టీప్లెక్సుల్లో చాలా మంది 250 రూపాయల ఫ్లాట్ రేట్లు అమల్లో పెట్టారు. ప్రసాద్స్ మల్టీప్లెక్సుతో పాటు చాలా స్క్రీన్స్ లో ఫ్లాట్ 295 రేట్లు నడుస్తున్నాయి.

అసలే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఇలాంటి టైమ్ లో రెండో రోజుకు టికెట్ రేట్లు తగ్గించాల్సింది పోయి.. ఇలా అరకొరగా తగ్గించి మమ అనిపించాయి మల్టీప్లెక్సులు. నిజానికి ప్రభుత్వం చెప్పిన 295 రూపాయలు అనేది గరిష్ట ధర మాత్రమే. ప్రతి సినిమాకు ఈ రేటు పెట్టుకోవాలనేది నిబంధన కాదు. తమ సినిమా స్థాయి, బిజినెస్, మార్కెట్, బడ్జెట్ బట్టి టికెట్ రేటు నిర్ణయించుకోవాలి.

కానీ కొంతమంది అత్యుత్సాహానికి పోయి ఇలా భారీ రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. థియేట్రికల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అర్జున ఫల్గుణ విషయానికొస్తే ఈరోజు తెలంగాణలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు సున్న. ఆక్యుపెన్సీ కూడా 40శాతం దాటేలా కనిపించడం లేదు.