“కరోనా వంటి వైపరీత్యాలతో పాటు కొందరు పాలకుల చిత్తచాపల్యం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాధలు పడ్డారు. పడుతూనే ఉన్నారు.” కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో ఉన్న ఏడుపుగొట్టు వాక్యం ఇది. కొత్త సంవత్సరం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూనే.. మరోవైపు తనలోని ఫ్రస్ట్రేషన్ ని, కడుపు మంటని ఇలా వెళ్లగక్కారు పవన్ కల్యాణ్. చిత్త చాపల్యం అంటూ పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై తన అక్కసు బయటపెట్టుకున్నారు.
ఎవరికి చిత్తచాపల్యం..
ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోవడం.. లక్ష్యం, గమ్యం ఏదీ లేకుండా ఏది తోచితే అది చేయాలనుకునేవారికి చిత్తచాపల్యం ఉందని అంటారు. మరి ఈ రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ చిత్త చాపల్యం ఉంది. రెండు పడవలపై ప్రయాణం చేయాలనుకునే పవన్ కల్యాణ్ కా.. లేక ప్రజారంజకంగా పాలించే రాష్ట్ర అధినాయకుడికా..? రాజకీయాలను సీజనల్ పాలిటిక్స్ గా చేసిన సీరియస్ సినిమా హీరోకా, లేక నవరత్నాలతో ప్రజలకు ఏ లోటు లేకుండా చూస్తున్న జగన్ కా..? ఎవరిది చాపల్యం.
ఇష్టం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ నోట్ విడుదల చేస్తారు, రాజకీయాలు ఇష్టం లేకపోతే దర్శకుడిని పిలిచి కథ చెప్పమంటారు, అది నచ్చితే సెట్స్ మీదకు వెళ్తారు. డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నానంటూ ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకుంటారు. పరిశ్రమలో అందరూ బాగుండాలని నీతి వాక్యాలు చెబుతారు కానీ, సినిమా బడ్జెట్ లో సగం తన రెమ్యునరేషన్ కే కావాలంటారు. ఇదీ పవన్ కల్యాణ్ హీరోయిజం.
సినిమాలు, రాజకీయాలు ఈ రెండిటిలో ఏదో తేల్చుకోలేక సతమతం అవుతున్న పవన్ కల్యాణ్ చిత్తచాపల్యం విషయంలో తనవైపు నాలుగు వేళ్లు చూపిస్తున్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఏయే పార్టీలతో జతకట్టారు, విడిపోయారు అనే ఉదాహరణ ఒక్కటి చాలు, ఆయనలో చిత్త చాపల్యం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. అంతెందుకు.. అనకూడదు కానీ, పవన్ వ్యక్తిగత జీవితం కూడా ఆయన మానసిక పరిస్థితికి, చిత్తచాపల్యానికి అద్దం పడుతుంది.
న్యూ ఇయర్ విషెస్ సందర్భంగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేరు ప్రస్తావించకుండా గాల్లో బాణం విసిరినా.. పవన్ కడుపు మంట ఎవరిపైనో అందరికీ తెలుసు. కొత్త సంవత్సరం తొలి రోజునే పవన్ కల్యాణ్ ఇలా పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కి, వైసీపీ శ్రేణుల టార్గెట్ కు గురవుతున్నారు. అసలు చిత్త చాపల్యం ఎవరికో పవన్ ముందుగా తెలుసుకోవాలంటున్నారు నెటిజన్లు.