ఉద్యోగులతో బేరసారాలు బాలేదు జగన్..!

ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే ఇవ్వలేమని చెప్పండి. అంతేకానీ ఉద్యోగులతో ఈ బేరసారాలేంటి. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న చర్చల సాగతీత ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశముంది. ఉద్యోగుల…

ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే ఇవ్వలేమని చెప్పండి. అంతేకానీ ఉద్యోగులతో ఈ బేరసారాలేంటి. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్న చర్చల సాగతీత ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశముంది. ఉద్యోగుల కోర్కెలకు, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు సగానికి సగం తేడా ఉంటోంది. 

ప్రభుత్వం 14.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తామంటోంది. ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నారని 55శాతంపై పీఆర్సీ ప్రకటన చేయాలనేది ఉద్యోగుల డిమాండ్. కానీ ప్రభుత్వం ఈ ప్రతిపాదన కాదంటోంది. ఉద్యోగులు మాకు గిట్టుబాటు కాదంటున్నారు. జీతాలు తగ్గిపోతాయనే భయంలో ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా ఇదే విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయి.

రోజులు, గంటల నుంచి మళ్లీ మొదలు..

గతంలో పీఆర్సీ ఫైల్ జగన్ దగ్గరకు వెళ్లిందని రెండ్రోజుల్లో ప్రకటన ఉంటుందన్నారు, మరికొన్ని గంటల్లోనే పీఆర్సీ ప్రకటన అని ఊరించారు. తీరా వారం గడిచినా ఫలితం లేదు. కొత్త ఏడాది వచ్చినా కూడా అసలేం జరుగుతుందో తెలియదు. దీంతో ఉద్యోగులు తాత్కాలికంగా ఆపేసిన నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు. నాన్చుడు ధోరణితో ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని మండిపడుతున్నారు.

తేల్చితే తప్పేంటి..?

ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న ఈ సమయంలో ఉద్యోగుల జీతాలు పెంచడం కుదిరేలా కనిపించడం లేదు. మరి అదేదో కుండబద్దలు కొడితే పోతుంది కదా. మొహమాటానికి పోయి జీతాలు పెంచినా ఏనెలకానెల సర్దుబాటు చేసుకోవడం కష్టం. ఈ దశలో అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు. మరి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది. 

ఉద్యోగులకు అర్థమయ్యేలా చెప్పి సర్దుబాటు చేసుకోవచ్చు కదా. ఇలా తిప్పించుకుని తప్పించుకుని చివరకు చేతులెత్తేస్తే అవమానం ఎవరికి, ఆగ్రహ జ్వాలల ఫలితం ఎవరు అనుభవించాలి..? మరి దీనిపై జగన్ కి సరైన సమాచారం ఉందా, లేక అంతా బాగానే ఉందని ఆయన భ్రమలో ఉన్నారా..?

యూనిఫామ్ ఇచ్చేసి సరిపెడతారా..?

రెండేళ్ల తర్వాత ప్రొబేషనరీ డిక్లేర్ చేస్తామంటూ సచివాలయ ఉద్యోగులకు అపాయింట్ మెంట్ రోజే తేల్చి చెప్పింది ప్రభుత్వం. రెండేళ్లు పూర్తై 2 నెలలు గడిచింది. ప్రొబేషన్ డిక్లరేషన్, జీతాల పెంపుపై ప్రకటనలే కానీ ఏదీ అమలులోకి రాలేదు. ఈలోగా సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ అంటూ హడావిడి మొదలైంది. ఈ యూనిఫామ్ వ్యవహారంపై కూడా ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. యూనిఫామ్ ఉచితంగా ఇస్తాం, కుట్టుకూలి డబ్బులు కూడా ఇస్తామంటున్న ప్రభుత్వం, అసలు యూనిఫామ్ తో కొత్తగా ఏం జరుగుతుందో అంచనా వేసిందా..?

గతంలో ఓసారి వాలంటీర్లు ఇలాగే జీతాలు పెంచాలంటూ గొడవ చేస్తే.. వారికి పరిస్థితి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు. మీరు చేసేది సేవ, ఉద్యోగం కాదని కుండబద్దలు కొట్టారు. ఇప్పటివరకూ ఎలాంటి సమస్యా రాలేదు. ఇష్టం వచ్చినవారు చేస్తున్నారు, కొత్త ఉద్యోగాలు వచ్చినవారు వెళ్లిపోతున్నారు.

ఎక్కడా ఎవరికీ ఎలాంటి సమస్యా లేదు. మరి అదే విషయం ఉద్యోగులకు కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా. ఉద్యోగుల జీతాల సమస్యను సాగదీసి చివరకు నిరాశ పరచడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు.