టాలీవుడ్ లో ఇక ఈ ట్రెండ్ ఆపితే మంచిదేమో!

ప్రతి వారం స్ట్రయిట్ సినిమాలొస్తున్నాయి, డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. వీటితో పాటు రీ-రిలీజెస్ కూడా ఉంటున్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, కనీసం డబ్బింగ్ సినిమాల గురించి మాట్లాడుకునే స్థాయిలో కూడా ఈ…

ప్రతి వారం స్ట్రయిట్ సినిమాలొస్తున్నాయి, డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. వీటితో పాటు రీ-రిలీజెస్ కూడా ఉంటున్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, కనీసం డబ్బింగ్ సినిమాల గురించి మాట్లాడుకునే స్థాయిలో కూడా ఈ రీ-రిలీజ్ ల గురించి మాట్లాడుకోవడం లేదు ఆడియన్స్.

అలా అని ఇవేవో అల్లాటప్పా సినిమాలు కాదు. మన స్టార్ హీరోలు నటించిన పాత బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవి. ఇలాంటి సినిమాల్ని విజువల్, సౌండ్ పరంగా క్వాలిటీ పెంచి మరోసారి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఆలోచన బాగానే ఉంది కానీ, ఆచరణలోనే ఈ పద్ధతి బెడిసికొడుతోంది.

బాలకృష్ణ, మహేష్, పవన్ నటించిన పాత బ్లాక్ బస్టర్ సినిమాలను రీ-రిలీజ్ చేసినప్పుడు వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ నటించిన ఒక్కడు, పవన్ ఖుషి లాంటి సినిమాలకు డబ్బులు కూడా వచ్చాయి. అయితే ఇలా 2-3 సినిమాలు మాత్రమే ఉంటున్నాయి, మిగతా సినిమాలన్నీ నామ్ కే వాస్తే రిలీజ్ అవుతున్నాయి తప్ప ఎలాంటి సౌండ్ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే, కొన్ని సినిమాల్ని సదరు హీరోల అభిమానులే పట్టించుకోవడం మానేశారు.

దీనికి తోడు ఫ్యాన్ వార్ ఒకటి..

అసలే రీ-రిలీజ్ సినిమాలు ఆడడం లేదంటే, అందులో ఫ్యాన్ వార్స్ కూడా. తమ హీరో సినిమా రి-రిలీజ్ లో ఇంత వసూలు చేసిందంటే, మా హీరో పాత సినిమా అంతకంటే ఎక్కువ వసూళ్లు సాధించిందంటూ కామెంట్స్ తో కొట్టుకోవడం, స్పేసెస్ లో తన్నుకోవడం కామన్ అయిపోయింది.

నిజానికి ఫ్యాన్స్ ను పక్కనపెడితే.. సాధారణ ప్రేక్షకులకు ఇలాంటి రీ-రిలీజెస్ తో పని లేదు. చూడాలనుకునే ప్రేక్షకుడు ఏ ఓటీటీలోనో లేదా యూట్యూబ్ లోనో ఆ సినిమా చూసుకుంటాడు. పనిగట్టుకొని, టికెట్ కొని థియేటర్ కు వెళ్లి చూడాలనుకోడు. ఈ విషయాన్ని ఇటు అభిమానులు, అటు నిర్మాతలు గ్రహిస్తే మంచిది.

ఉన్న పరువు పోగొట్టుకోవడం ఎందుకు..

పైగా రీ-రిలీజ్ కలెక్షన్లు అంటూ లేనిపోని లెక్కలుచెప్పి, స్వయంగా అభిమానులే సదరు బ్లాక్ బస్టర్ సినిమా పరువు  తీసిపడేస్తున్నారు. ఏమాత్రం ఆక్యుపెన్సీ లేకుండా, అరకొరగా వచ్చే వసూళ్లను గొప్పగా చెప్పుకునే బదులు, సదరు పాత హిట్ సినిమాను రీ-రిలీజ్ చేయకుండా ఉండడమే మంచిది.

ఇప్పటికైనా ఈ విషయంలో హీరోలు, నిర్మాతలు పునరాలోచించుకోవాలి. 2-3 సినిమాల వరకు రీ-రిలీజ్ ట్రెండ్ బాగానే నడిచిన మాట వాస్తవం. అలా అని దాన్ని అలానే కొనసాగించి, మరిన్ని ఫ్యాన్ వార్స్ కు అవకాశం ఇవ్వకూడదు. తమ సినిమా పరువును తామే తీసుకోకూడదు.

అలనాటి క్లాసిక్స్, పాత తరం బ్లాక్ బస్టర్స్ ను రీమేక్ చేయకూడదని చాలామంది హీరోలు అనుకుంటారు. అదే విధంగా తమ ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ ను రీ-రిలీజ్ చేయకూడదని కూడా గట్టిగా నిర్ణయించుకునే టైమ్ వచ్చింది. ఇక ఈ ట్రెండ్ ను ఆపితే మంచిది.