కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి రాధికాకు చిత్ర పరిశ్రమతో సంబంధాలున్నాయి. నటిగా, నిర్మాతగా ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందారు. కుమార స్వామి కుటుంబానికి, కన్నడ చిత్ర రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. కుమారస్వామి సోదరుడి కుమారుడు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా కుమారస్వామి సతీమణి రాధికా నిర్మించిన సినిమాని ఆమె అనుమతి లేకుండా ఓ యూట్యూబ్ చానల్ నేరుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ విషయమై రాధికా సీరియస్ అయ్యారు. 2013లో స్వీటీ నాన్న జోడి అనే టైటిల్‌తో కన్నడంలో రాధికా సినిమాని నిర్మించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను అప్పట్లో రూ.3 కోట్లతో నిర్మించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు.
ఈ విషయం తెలిసి కూడా ఆ సినిమా అనుమతుల్లేకుండానే ఓ యూట్యూబ్ చానల్ నేరుగా యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. రాధికా సదరు చానల్ పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు ముందుకెళుతున్నారు. ఇందులో భాగంగా ఆమె బెంగళూరులోని సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల కన్నడ చిత్రపరిశ్రమలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేజీఎఫ్ చిత్ర విషయంలోను ఇట్లే జరగడం గమనార్హం.