2024 టీడీపీ మేనిఫెస్టో ఇదే.. తేల్చేసిన నాని

2024 ఎన్నికల్లో అధికారమే పరమావధిగా టీడీపీ ఎంతకైనా బరితెగిస్తుందని జోస్యం చెప్పారు మంత్రి కొడాలి నాని. ఓసీలను బీసీల్లోకి మారుస్తామని, బీసీలను ఎస్టీల్లోకి మారుస్తామంటూ కబుర్లు చెబుతారు జాగ్రత్తగా ఉండమని ప్రజలకు సూచించారు. అంతే…

2024 ఎన్నికల్లో అధికారమే పరమావధిగా టీడీపీ ఎంతకైనా బరితెగిస్తుందని జోస్యం చెప్పారు మంత్రి కొడాలి నాని. ఓసీలను బీసీల్లోకి మారుస్తామని, బీసీలను ఎస్టీల్లోకి మారుస్తామంటూ కబుర్లు చెబుతారు జాగ్రత్తగా ఉండమని ప్రజలకు సూచించారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికలనాటికి ఆల్ ఫ్రీ బాబుని చూస్తామని చెప్పారు. జీవితంలో బాబుకి అవే చివరి ఎన్నికలు కాబట్టి.. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానని బాబు కల్లబొల్లి మాటలు చెబుతారని అన్నారు.

అయితే ఎన్ని చేసినా, ఎంత ఎదురు చూసినా బాబు కల నెరవేరదని అన్నారు నాని. రైతులకిచ్చే ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ చేసే విషయంలో టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని ఎండగట్టేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాని.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఎన్నాళ్లు బతికుంటాడో తెలియని బాబు వైసీపీపై పగ సాధిస్తాననడం పగటి కలేనన్నారు. మాస్క్, గ్లౌజు, కళ్లజోడుతో హైదరాబాద్ నుంచి కాకుండా చంద్రబాబు అంతరిక్షం నుంచి విజయవాడ వచ్చినట్టుందని సెటైర్ పేల్చారు నాని.

హుద్ హుద్ కి ఎదురెళ్లానని చెప్పుకునే బాబు కరోనాకి ఎందుకు ఎదురెళ్లడంలేదని ప్రశ్నించారు? దోమలపై దండయాత్ర చేసిన చంద్రబాబు కరోనాపై ఎందుకు చేయలేదని విమర్శించారు. ఇన్నాళ్లూ హైదరాబాద్ లో దాక్కుని ప్రవాసాంధ్రుడిలాగా అప్పుడప్పుడు ఏపీలోకి వచ్చిపోతున్న చంద్రబాబుని తెలుగు ప్రజలు ఎలా నమ్మాలని, ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.

కరోనా భయంతో తనని తాను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో.. అలాగే వైసీపీ నుంచి కూడా కాపాడుకోవాలని హితవు పలికారు. లేకపోతే వైసీపీ చేతిలో బాబుకి మరోసారి పరాభవం తప్పదని హెచ్చరించారు. కరెంటు చార్జీలు పెంచి, నిరసనకారుల్ని గుర్రాలతో తొక్కించి, బుల్లెట్లు పేల్చి వారి ప్రాణాలు తీసిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు నాని. అలాంటి నీఛ చరిత్ర ఉన్న బాబుకి రైతుల పక్షాన మాట్లాడే అర్హత లేదన్నారు.

ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపై పెట్టిన మహానుభావుడు వైఎస్ఆర్ అని, ఆయన పేరుకి భంగం కలిగించే పని ఏదీ జగన్ చేయరని చెప్పారు.