ఒక థ్రిల్.. 3 షాకులు.. ఏప్రిల్ బాక్సాఫీస్ రివ్యూ

సరిగ్గా ఏడాది కిందట ఇదే నెలలో టాలీవుడ్ కు ఓ భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అలాంటి షాకులు…

సరిగ్గా ఏడాది కిందట ఇదే నెలలో టాలీవుడ్ కు ఓ భారీ షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అలాంటి షాకులు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 తగిలాయి.

ఏప్రిల్ మొదటి వారంలో.. రావణాసుర, మీటర్ సినిమాలొచ్చాయి. రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైంది. సుశాంత్ కీలక పాత్రలో కనిపించడం, ఏకంగా ఐదుగురు హీరోయిన్లు మెరవడం, కథలో ఏదో ఉందంటూ ప్రమోషన్ లో ఊదరగొట్టడంతో రావణాసుర హాట్ టాపిక్ అయింది. అయితే విడుదలైన మొదటి రోజు, మొదటి ఆటకే పరమ డిజాస్టర్ అనిపించుకుంది.

అటు కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాది కూడా ఇదే పరిస్థితి. కంటెంట్ ఉన్న సినిమాలు చేసే అబ్బవరం, మీటర్ తో ఫక్తు మాస్-మాసాలా సినిమా ఎంచుకున్నాడు. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు చేయాల్సిన సబ్జెక్ట్ ను కిరణ్ మోయలేక చతికిలపడ్డాడు. అలా రెండు భారీ ఫ్లాపులతో మొదలైన ఏప్రిల్ బాక్సాఫీస్ కు మరింత పెద్ద షాక్ శాకుంతలం రూపంలో తగిలింది.

ఏప్రిల్ రెండో వారంలో.. శాకుంతలం రిలీజైంది. కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలం ఆధారంగా, సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమా ఏ సెక్షన్ ఆడియన్స్ కూ నచ్చలేదు. పిల్లా-పెద్ద, యువత, మహిళ.. ఇలా అన్ని వర్గాలవారు ముక్తకంఠంతో తిప్పికొట్టిన సినిమా ఇది. స్వయంగా దిల్ రాజే, 'తన పాతికేళ్ల కెరీర్ లో అతిపెద్ద జర్క్ శాకుంతలం' అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడంటే ఈ సినిమా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

శాకుంతలంతో పాటు రుద్రుడు, విడుదల పార్ట్-1 కూడా థియేటర్లలోకి వచ్చాయి. లారెన్స్ నుంచి సగటు తెలుగు ప్రేక్షకుడు ఆశించిన అంశాలు రుద్రుడులో లేకపోవడంతో అది ఫ్లాప్ అయింది. ఇక రస్టిక్ డ్రామాగా తెరకెక్కిన విడుదల పార్ట్-1ను కూడా టాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు.

ఏప్రిల్ మూడో వారంలో… విరూపాక్ష వచ్చింది. టాలీవుడ్ కు ఆక్సిజన్ అందించింది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో క్లిక్ అయింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా, కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేశాయి. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమా ఇదే. ఈ మూవీతో పాటు వచ్చిన ఓ 4 చిన్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఇక ఏప్రిల్ చివరి వారంలో.. భారీ అంచనాలతో వచ్చింది ఏజెంట్ మూవీ. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా షాకిచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్లుచెదిరే బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. ఎలాంటి కొత్తదనం లేని కథకు, వైల్డ్ సాలా కాన్సెప్ట్ జోడించి, అఖిల్ ను సిక్స్ ప్యాక్ లో చూపించి మేజిక్ చేయాలని చూశాడు దర్శకుడు. కానీ అది ఏ కోశానా వర్కవుట్ కాలేదు.

ఏజెంట్ తో పాటు మణిరత్నం తీసిన పీఎస్-2 కూడా వచ్చింది. పార్ట్-1తో పోలిస్తే, ఇది కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం పార్ట్-1నే రిపీట్ చేసింది. ఏజెంట్, పీఎస్-2తో పాటు వచ్చిన మరో 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

ఓవరాల్ గా ఏప్రిల్ నెలలో రావణాసుర, శాకుంతలం, ఏజెంట్ సినిమాలు షాక్ ఇవ్వగా.. విరూపాక్ష ఒక్కటే థ్రిల్ ఇచ్చింది. అలా గతేడాది ఏప్రిల్ నెలలో ఒక షాక్ తగిలితే, ఈ ఏడాది ఏప్రిల్ లో ఏకంగా 3 షాకులు తగిలాయి.