స్టోరీ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తాం, ఎంతైనా కష్టపడతామంటారు మన హీరోలు. అలా చెప్పిన మాటల్ని చేతల్లో చూపిస్తున్నారు కొంతమంది హీరోలు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం ఎక్సర్ సైజులు చేసి మేకోవర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్ లోకి నాగచైతన్య కూడా చేరాడు.
త్వరలోనే చందు మొండేటితో కలిసి కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు చైతూ. సముద్రం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో మత్స్యకార గ్రామానికి చెందిన వ్యక్తిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతడు తన లుక్ ను మార్చుకుంటున్నానడే విషయాన్ని ఇప్పటికే వెల్లడించాం.
ఇప్పుడు లుక్ తో పాటు ఫిజిక్ కూడా మార్చుకుంటున్నాడు చైతూ. తన కొత్త సినిమా కోసం మరింత ఫిట్ గా తయారయ్యేందుకు జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా ఈ వీడియోను షేర్ చేశారు. తన సినిమా కోసం నాగచైతన్య పడుతున్న కష్టం ఇది.
ఇలా పాత్రల కోసం కసరత్తులు చేసిన హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. మొన్నటికిమొన్న గుంటూరుకారం సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ఎక్సర్ సైజులు స్టార్ట్ చేశాడు. సినిమాలో మాస్ లుక్ లో కనిపించేందుకు ఇంకాస్త ఎక్కువగా జిమ్ చేశాడు. ఆ వీడియోల్ని నమ్రత షేర్ చేసిన సంగతి తెలిసిందే.
అంతకంటే ముందు రామ్ చరణ్, తారక్ కూడా ఇలా జిమ్ లో చెమటోడ్చారు. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పాత్ర కోసం తారక్, సీతారామరాజు క్యారెక్టర్ కోసం చరణ్.. జిమ్ లో చాలా కష్టపడి రాజమౌళి ఆశించిన ఫిజిక్ ను సొంతం చేసుకున్నారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం రవితేజ.. గని, గాండీవధారి అర్జున సినిమాల కోసం వరుణ్ తేజ్ కోసం జిమ్ లో బాగానే కష్టపడ్డారు. ఇలా పాత్రల కోసం హీరోలు అదనంగా కష్టపడ్డానికి ఏమాత్రం వెనకాడ్డం లేదు.