కరోనా కష్టకాలంలో తన సంపాదనలో 90శాతం విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు హిందీ హీరో అక్షయ్ కుమార్. ఉత్తరాదికే చెందిన విలన్ సోనూ సూద్.. వలస కూలీలకు చేసిన సహాయం, సేవ.. ఆయన్ను హీరోగా నిలబెట్టింది. దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. తన ఫామ్ హౌస్ లో వలస కూలీలకు ఆశ్రయమిచ్చి, వారు సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. మరి మన తెలుగు హీరోలు ఏం చేస్తున్నారు.
కరోనా క్రైసిస్ చారిటీ కి విరాళాలిచ్చారు. వ్యక్తిగత స్థాయిలో కూడా సహాయం చేశారు. తమ శక్తిమేరకు సినీ కార్మికుల్ని, పేదల్ని ఆదుకున్నారు. అంతా కలిసి తమ పెద్ద మనసు చాటుకున్నారు. అలా ప్రజల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఓ మంచి పేరు సంపాదించుకుంది. ఇక్కడితో ఆగితే బాగుండేది. తాజాగా బాలయ్య, నాగబాబు మాటల యుద్ధం తెలుగు సినీ ఇండస్ట్రీ పరువుని బజారుకీడ్చింది. ఇప్పటివరకు సంపాదించుకున్న మంచిపేరును చెడగొట్టింది.
కరోనా కష్టకాలంలో కార్మికులకు సాయంగా ఉండాల్సిన సందర్భంలో, షూటింగ్ లు త్వరగా ప్రారంభించి చిన్నాచితకా ఆర్టిస్టులు, టెక్నీషియన్లని ఒడ్డున పడేయాల్సిన టైమ్ లో రాజకీయాలు స్టార్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణ చేసిన ఆరోపణలు నూటికి నూరుశాతం నిజం కాకపోయినా.. గతంలో వివాదాల్లో ఉన్న స్టూడియోల వ్యవహారాలు ఇటీవల చప్పబడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పిలవని పేరంటానికి పోకపోతే పోయాడు, మళ్లీ తనను పిలవలేదని బాలయ్య గింజుకోవడం ఎందుకు? దాన్ని రాద్ధాంతం చేసి తెలుగు సినీ పరిశ్రమ పరువు రోడ్డుకీడ్చడం ఎందుకు? ఇక నాగబాబు ఓవర్ యాక్షన్ ఈ వివాదాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాయి. బాలయ్యకి ఎవరూ సపోర్ట్ రాలేదు కాబట్టి సరిపోయింది కానీ.. ఇలాంటి మాటలతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయే ప్రమాదముంది.
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కటిగానే ఉందంటే మహామహులు వేసిన పునాదులు అలాంటివి. ఇప్పుడిలా పంతాలకు పట్టింపులకు పోయి ఇండస్ట్రీలో చిచ్చుపెడితే పోయేది టాలీవుడ్ పరువే. కరోనా కష్టకాలంలో మిగతా చిత్ర పరిశ్రమ నటీనటులు, టెక్నీషియన్లు.. స్వయంగా రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుంటుంటే.. తెలుగు సినీ పరిశ్రమ మాత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇంతవరకు సంపాదించుకున్న మంచి పేరును చెడగొట్టుకుంది.