ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గౌరవ మర్యాదలిస్తారు. ఎందుకంటే ఆయన వాదన, విశ్లేషణ న్యాయం వైపు ఉంటుంది కాబట్టి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపు, దానిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే హైకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందనే ఉద్దేశంతో ఆగమేఘాలపై నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు తానుగా బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకున్నారు. దీనిపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెబుతూ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.
అనంతరం ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు తీసుకోవడం సరైందా? కాదా? అనే అంశంపై వర్గాలుగా విడిపోయి వాదోపవాదనలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన యూట్యూబ్ చానల్‌లో చేసిన విశ్లేషణ వైరల్ అవుతుంది. ఆ విశ్లేషణలో ఎలా సాగిందో ఆయన మాటల్లోనే యథాతధంగా….
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినట్టు ఎన్నికల సంఘం కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. దీనిపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెప్పడంతో ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. అసలు గందరగోళం ఎక్కడ వచ్చిం దంటే….ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తనకు తానుగా బాధ్యతలు చేపట్టవచ్చా అనే దగ్గర వచ్చింది. హైకోర్టు తీర్పులో ఏముంది?
హైకోర్టు తీర్పులో పేరా 317, 318 చదవాలి. నాకు గుర్తు ఉన్నంత వరకు 319 పేరాలున్నాయి. 317వ పేరాలో ఏం చెప్పా రంటే…ఆర్డి నెన్స్ ఆధారంగా జారీ చేసిన జీవోలు పక్కకు పెట్టారు. ఆ జీవోలు అమలు కావు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తిరిగి తన పదవిని పొందుతాడు. జస్టిస్ కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాడు.
318 పేరా ప్రకారం…రమేశ్‌కుమార్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలు అప్పచెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆటోమేటిక్‌గా రమేశ్‌కుమార్‌ను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించలేదు. బాధ్యతలు చేపట్టడం వేరు, నియామకం వేరు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఎవరో ఒకరు చార్జ్ ఇవ్వాలి. నిమ్మగడ్డకు చార్జ్ ఇచ్చి వెళ్లిపొమ్మని జస్టిస్ కనగరాజ్‌కు హైకోర్టు చెప్పలేదు. ఈ పేరా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు బాధ్యతలు వచ్చేలా చేయాలి. ఆ ప్రాసెస్ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రమేశ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్ప చెప్పకుండానే తనకు తాను ఆ పని చేయడం హైకోర్టు తీర్పునకు విరుద్ధం. నిమ్మగడ్డ పదవి పొందాడు. కానీ చార్జ్ మాత్రం తీసుకోలేడు. ఇది పేరా 318 చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ తీర్పులోనైనా తమకు ప్రతికూలంగా తీర్పు వస్తే వారికి కూడా హక్కులుంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వచ్చింది. కావున ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కు ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర హైకోర్టుకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపైన ఎగువ న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే హక్కును ఉపయోగించుకోదలిచామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ విషయం తెలిసి కూడా, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోక ముందే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తనకు తాను బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకుంటే పూర్తిగా తప్పే. ఇది హైకోర్టు తీర్పుకు మాత్రమే వ్యతిరేకం కాదు, సహజ న్యాయసూత్రాల పరంగా కూడా తప్పు. సహజ న్యాయసూత్రాలు ఏం చెబుతున్నాయంటే కేసు ఓడిపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని హక్కులుంటాయో, గెలిచిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కూడా అన్నే హక్కులుంటాయి.
కావున నిమ్మగడ్డ తొందరపడి బాధ్యతలు చేపట్టడం డీసెంట్ బిహేవియర్‌కు కూడా విరుద్దం. నిమ్మగడ్డ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి తొందరపడి పదవిలోకి రావాలనే ఆకాంక్ష వ్యక్తం చేయడం ఎన్నికల సంఘం గౌరవాన్ని ఇనుమడింప చేయదు. హైకోర్టు తీర్పు అనేది ఆ ప్రక్రియలో ఫైనల్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం పైన్యాయస్థానానికి వెళ్లొద్దనుకుంటే ఫైనల్ అవుతుంది. అందువల్ల న్యాయపరమైన తుది తీర్పు కోసం ఎదురు చూడాల్సిందే. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్లనివ్వాలి. అక్కడ స్టే ఇస్తారో లేదో చూడాలి.
ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ సాగింది. నిమ్మగడ్డ చేసిన తప్పులను సుతిమెత్తగా ఆయన ఏకిపారేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ తెలుసుకున్న తర్వాత, అసలు నిజాలు గ్రహించాక …నిమ్మగడ్డపై ఓ అంచనాకు తప్పక వస్తారు.