Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ నుంచి రాజకీయ సాయాలు

టాలీవుడ్ నుంచి రాజకీయ సాయాలు

సినిమాలు, రాజకీయాలు రెండూ ఎప్పుడు భిన్నం కాదు. ఇప్పుడు అస్సలు కాదు. ఎందుకంటే రెండింటి వెనుక వున్నది వ్యాపారమే. రాజకీయాల అండ సినిమాకు కావాలి. సినిమాల పెట్టుబడి రాజకీయాలకు కావాలి. అలాగే ఎన్నికలు వస్తే వీళ్ల సాయం వాళ్లకి, అధికారం అందాక వాళ్ల సాయం వీళ్లకి. ఇదంతా ఉభయ కుశలోపరి.

ఎన్నికలు ముగిసాక, అధికారం అందుకున్నాక, వచ్చే నల్ల డబ్బును తిప్పాలంటే సినిమాల్లోకి పంపాలి. ఎన్నికల టైమ్ లో తమకు పరిచయం వున్న అభ్యర్ధులకు తలా కాస్త సాయం అందిస్తే, గెలిచిన తరువాత తమ పనులకు పనికి వస్తారు. ఇలా రాజకీయాలకు, సినిమాలకు నడుమ చాలా అంటే చాలా ఈక్వేషన్లు, సన్నిహిత బంధాలు వున్నాయి.

అందుకే ఇప్పడు టాలీవుడ్ నుంచి ఆంధ్ర ఎన్నికలకు సాయం అందుతోంది. అలా అని భయంకరంగా కోట్లకు కోట్లు అయితే వెళ్లిపోవడం లేదు. తమకు తెలిసిన అభ్యర్ధులు అందరికీ ఉడతా భక్తిగా తలా కొంత అందిస్తున్నారు పలువురు నిర్మాతలు. కానీ ఇలా అందుకుంటున్న వారిలో ఎక్కువ మంది కూటమి అభ్యర్ధులే వుండడం విశేషం.

మైనింగ్ మూలాలున్న ఓ అభ్యర్థికి పలువురు నిర్మాతలు తలా కాస్త అందిస్తున్నారు. ఈయనకు సినిమా రంగంలోకి పలువురు నిర్మాతలతో మంచి బంధాలున్నాయి. అలాగే సినిమాలు నిర్మించకపోయినా, సినిమా రంగంతో బంధాలున్న ఓ వివాదాస్పద రాజుగారికి కూడా తలా కాస్త సాయం వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే సినిమా సంబంధిత శాఖ నిర్వహించిన ఓ మంత్రి వారసుడికి కూడా సాయం అందినట్లు తెలుస్తోంది.

ఇవన్నీ వ్యక్తిగతంగా చేస్తున్నవి. ఇవి కాక కొన్ని నిర్మాణ సంస్థలు అన్ని పార్టీలకు తలా కొంచెం సాయం అందించినట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నిక టైమ్ లోనూ ఇది కామన్ అని, ఇక్కడ డిమాండ్ ఏమీ వుండదని, అంతా కర్టెస్టీ గా జరుగుతుందని ఓ నిర్మాత అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?