టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది రాత్రి పార్టీ చేసుకున్నారు. ఒక్కొక్కరు తమ టేస్ట్ కు తగ్గట్టు, క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ కు ఆహ్వానం పలికారు. చిరంజీవి-చరణ్ కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీకి చరణ్, తన క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్ ను ఆహ్వానించాడు.
ఇక మహేష్ బాబు ఎప్పట్లానే ఈ ఏడాది కూడా విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులందరితో కలిసి విదేశాలకు వెళ్లిన మహేష్, అక్కడే కొత్త ఏడాదికి స్వాగతం పలికాడు. దానికి సంబంధించిన ఫొటోల్ని మహేష్ భార్య నమ్రత షేర్ చేసింది.
ఇక ప్రభాస్ పార్టీలకు దూరమనే సంగతి తెలిసిందే. అతడు తన ఇంట్లోనే కొత్త సంవత్సర వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు, నలుగురు వ్యక్తులు మాత్రమే అందులో ఉన్నారు. అమెరికాలో మంచు తుపాను కారణంగా ఎక్కువ మంది హీరోలు ఈ ఏడాది విదేశీ పర్యటనలు పెట్టుకోలేదు.
హీరోయిన్ల విషయానికొస్తే.. సరిగ్గా కొత్త ఏడాదికి స్వాగతం పలికేముందు అభిమానులతో వీడియో ఛాటింగ్ పెట్టింది రష్మిక. ఓ అందమై రిసార్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ షురూ చేసింది. అయితే ఆ రిసార్ట్ ఎక్కడుందనే విషయాన్ని ఆమె బయటపెట్టలేదు.
అటు అనన్య పాండే మాత్రం కొత్త ఏడాదిని పుకెట్ లో సెలబ్రేట్ చేసుకుంది. బీచ్ తో ఎంజాయ్ చేస్తూ, నచ్చిన పుస్తకం చదువుతూ, ఇష్టమైన భోజనం తింటూ డిసెంబర్ 31ని గడిపేసింది. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న హన్సిక, తన భర్తతో కలిసి చెక్ రిపబ్లిక్ వెళ్లింది. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది.
రకుల్ ప్రీత్, కేతిక శర్మ లాంటి హీరోయిన్లు చాలామంది ముంబయికి పరిమితమయ్యారు. తమకు ఇష్టమైన స్టార్ హోటల్స్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇక శృతిహాసన్, తన ప్రియుడితో కలిసి ముంబయిలోని తన ఫ్లాట్ లో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది.
అను ఎమ్మాన్యుయేల్ బెంగళూరులో పార్టీ చేసుకుంది. ఇలా టాలీవుడ్ కు చెందిన హీరోహీరోయిన్లంతా తమకు నచ్చిన విధంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.