దర్శకుడు త్రివిక్రమ్ గత కొంత కాలంగా రెండు కాదు చాలా పడవల మీదే కాళ్లేస్తున్నారు. ఒక వైపు సితార సంస్థ నిర్మించే సినిమాల్లో భాగస్వామ్యం. ఆమె శ్రీమతి నిర్మాత కావడంతో ప్లానింగ్ దగ్గర నుంచి విడుదల వరకు వాటి క్వాలిటీ కంట్రోలు చూసుకోవడం.
రెండవది మిత్రుడు పవన్ కళ్యాణ్ వ్యవహారాలు. ఆయన సినిమాలు ప్లానింగ్. అవి కూడా చూసుకోవాలి. వీటన్నింటి మధ్యలో తన స్వంత సినిమాల సంగతులు కూడా చూసుకోవాలి.
ప్రస్తుతం త్రివిక్రమ్ వచ్చే నెల నుంచి మహేష్ బాబు సినిమా షూట్ కు వెళ్లాలి. కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ వేరే పనులు చూసుకోవడం గురించి మహేష్ అసంతృప్తితో వున్నారని, దాంతో ఆయన పనులు అన్నీ పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. ఈ లోగా పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో అటు పనులు కూడా త్రివిక్రమ్ తగ్గాయి.
కానీ ఇప్పుడు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ లోగా పెండింగ్ లో వున్న హరి హర వీరమల్లు సినిమా కొంత ఫినిష్ చేస్తారని వార్తలు వినవచ్చాయి. ఇప్పుడు పవన్ తన మరో రీమేక్ మీద కూడా దృష్టి పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రఖని డైరక్షన్ లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేయబోయే వినోదహితం రీమేక్ కు పవన్ 20 రోజుల వర్క్ చేయాల్సి వుంది. అది సెప్టెంబర్ లో చేసే ఆలోనచలో వున్నారని వినిపిస్తోంది.
ఈ మేరకు త్రివిక్రమ్ ఆ ప్రాజెక్ట్ గురించి సమాలోచనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ త్రివిక్రమ్ నే అందిస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్లానింగ్ కూడా త్రివిక్రమ్ దే. అందుకే ఆ మేరకు ఆయన డిస్కషన్లు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.