మునుగోడులో బీజేపీ, టీఆరెస్ పార్టీలు గెలుపు కోసమే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల్లోనూ అంతర్గత కలహాలు లేవని కాదు. ఉన్నాయి. కానీ ఆ పార్టీల్లో కంట్రోల్ చేసే నాయకత్వాలు ఉన్నాయి. ఆ రెండు పార్టీలో కూడా ఒక పార్టీ గెలవడం గ్యారంటీ.
ఇక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయినప్పటి నుంచి అంతర్గత కలహాలు ఉన్నాయి. చాలాసార్లు నాయకులు బయటపడ్డారు కూడా. కానీ ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందో కలహాలు తీవ్రమైపోయాయి.
మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది కూడా అని రేవంత్ రెడ్డి, ఆయనకు అనుకూలంగా ఉన్న నాయకులు ఎంతగా చెప్పుకుంటున్నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా చాలామంది సీనియర్లు కాంగ్రెస్ గెలుపు గురించి ఆలోచించకుండా రేవంత్ రెడ్డి పదవి ఎలా ఊడుతుందా అని ఆలోచిస్తున్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే రేవంత్ సత్తా ఏమిటో చెప్పినట్లవుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం రేవంత్ కు వ్యతిరేకంగా చాలామంది సీనియర్లు మరింతగా రెచ్చిపోతారు. పీసీసీ అధ్యక్ష పదవి నుండి దింపేసేంతవరకు ఊరుకోరు.
సో … పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంతవసరమో రేవంత్ కు అంతకు మించే అవసరం. ఈ విషయం రేవంత్ కు తెలీకుండా ఏముండదు. తిమ్మిని బమ్మిని చేస్తారో, బిమ్మినే తిమ్మిని చేస్తారో తెలీదుకానీ మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాల్సిందే.
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు పార్టీ గెలుపు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమి మాత్రం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటమనే చెప్పాలి. ఎందుకంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారో తెలీదుకానీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళకు కొదవేమీలేదు.
కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్నవాళ్ళల్లో అత్యధికులకు రేవంతే టార్గెట్. రేవంత్ ను దెబ్బకొట్టేందుకు అవసరమైతే పార్టీకి వ్యతిరేకంగా పోటీచేయటానికి కూడా కాంగ్రెస్ నేతల్లో చాలామంది రెడీగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతి పెద్ద సమస్యే ఇది. టికెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే పార్టీ ఎవరినో ఒకరిని మాత్రమే పోటీలో దింపగలుగుతుంది.
దాంతో మిగిలిన వాళ్ళల్లో కొందరు సైలెంటుగా ఉండిపోతారు. మరికొందరు అభ్యర్ధి ఓటమికి వెనుకనుండి గోతులు తవ్వుతారు. కాంగ్రెస్ కల్చర్ బాగా తెలిసిన తర్వాత కూడా రేవంత్ పార్టీలో చేరారు. చాలా తొందరగానే ప్రెసిడెంట్ అయిపోయారు. అక్కడినుండే అసలు సమస్య మొదలైంది.
మొన్నటి హుజూరాబాద్ ఉపఎన్నికలోనే రేవంత్ కు పెద్ద దెబ్బ పడాల్సింది. అయితే తెరవెనుక జరిగిన అనేక పరిణామాల కారణంగా కాంగ్రెస్ ఓటమి బాధ్యతనుండి రేవంత్ తప్పించుకున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నిక నుండి అలా తప్పించుకోలేరు. కాంగ్రెస్ పార్టీకి ఇపుడు గెలిచి తీరాల్సిన అగత్యం ఏర్పడింది.
ఎందుకంటే మొన్నటివరకు ఇది కాంగ్రెస్ సీటు కాబట్టి. అందులోనూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ఈ ఉప ఎన్నిక విజయం పునాది అవుతుందని అనుకుంటున్నారు కాబట్టి. మరో విషయం ఏమిటంటే …బీజేపీని వ్యతిరేకించే పేరుతో వామపక్షాలు కూడా టీఆరెస్ కే మద్దతు పలికాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఆశలు నెరవేరలేదు.
మునుగోడులో విజయం సాధించకపోతే రేవంత్ రెడ్డి బతుకు బస్ స్టాండ్ అవుతుందా?