హారిక-హాసిని బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా అది త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుంది. ఇక సితార బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే, కచ్చితంగా అందులో త్రివిక్రమ్ చొరవ ఉంటుంది. ఆయన ఇన్-పుట్స్ లేకుండా ‘సితార’లో సినిమా పాస్ అవ్వదు. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం దీనికి మినహాయింపు అంటున్నాడు హీరో విశ్వక్ సేన్.
“మా సినిమా నుంచి త్రివిక్రమ్ ఇప్పటివరకు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. ఈమధ్య ఓ పంక్షన్ లో కలిసినప్పుడు కూడా సినిమా రెడీ అయింది, మీరు చూడాలని నేను కోరాను. త్రివిక్రమ్ లాంటి వ్యక్తి మా సినిమా చూసి తన అభిప్రాయం చెబితే చాలా బాగుంటుంది కదా. కానీ ఇప్పటివరకు ఆయన ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. ఇప్పుడు నేరుగా సినిమా రిలీజ్ అయిపోతోంది.”
ఇలా త్రివిక్రమ్ కు చూపించకుండానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను విడుదల చేస్తున్నామంటున్నాడు హీరో విశ్వక్ సేన్. ఇది మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. సితార నుంచి వచ్చే ప్రతి సినిమాను విడుదలకు ముందు త్రివిక్రమ్ చూస్తారు, కానీ ఈ సినిమా విషయంలో ఆయన ప్రమేయం లేకపోవడం ఆశ్చర్యం.
ఇక తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. గత వారం రిలీజ్ అనుకున్నారు. దీనికి కూడా ఓ కారణం చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. ఆ టైమ్ లో విశ్వక్ సేన్ కు గొంతు పట్టేసిందట. దాదాపు 6 రోజుల పాటు సరిగ్గా మాట్లాడలేకపోయాడంట. అందుకే సినిమాను వాయిదా వేశామంటున్నాడు. ఎట్టకేలకు 31న థియేటర్లలోకి వస్తోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.