ఎన్నికల ముందు ఎంత తెర వెనుక వుంచాలో అంతకు అంతా వుంచారు నారా లోకేష్ ను. పాదయాత్ర ముగిసిన తరువాత పవన్ తో చెలిమి కుదిరాక, లోకేష్ ను చాలా అంటే చాలా లో ప్రొఫైల్ లో వుంచారు. పవన్ నే ముందుకు నడిపించారు. దటీజ్ చంద్రబాబు. ఇక్కడ పని జరిగేది పవన్ తో అని చంద్రబాబుకు తెలుసు.
పవన్ ను ఎలా మేనేజ్ చేసి, ఎలా దగ్గరకు లాక్కోవాలో, ఎలా వాడుకోవాలో అంతా తెలుసు. కానీ లక్ష్యం ఏమిటి లోకేష్ ను సిఎమ్ ను చేయడం. కానీ ఇప్పుడు దాన్ని ముందే బయటపెడితే జనం ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలుసు. అనుభవం పండిన తను అంటే ఓకె అంటారు. కానీ లోకేష్ అంటే నో అంటారేమో.. అంటారేమో ఏమిటి అంటారు. అందుకే లోకేష్ ను అలా పక్కన మంగళగిరికి పరిమితం చేసారు.
కానీ అందరికీ తెలుసు. ఈసారి చంద్రబాబు పక్కాగా లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తారు అని. గతంలోనే మంత్రిగా వుంటూ, తెరవెనుక అన్నీ తానై వ్యవహరించారు. ఈసారి పార్టీ పరంగా అన్నీ తానై చూసుకున్నారు. ఇక మిగిలింది సిఎమ్ కావడమే. అయితే ఇప్పటికిప్పుడు నేరుగా సిఎమ్ గా లోకేష్ ను ప్రకటించరు. అయిదేళ్లలోపు అంచెలు అంచెలుగా అక్కడికి చేరుస్తారు.
అందుకు తగిన కార్యాచరణ కు బీజం వేసారు బుద్దా వెంకన్న. అర్జంట్ గా పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్పగించాలి అంటూ డిమాండ్ చేసారు. లోకేష్ ఇప్పటికే పార్టీ జాతీయ కార్యదర్ళి. అందువల్ల పార్టీ పగ్గాలు అప్పగించటం అంటూ ఏమీ లేదు. ఇది కేవలం తమ భావి నాయకుడు లోకేష్ నే అని చెప్పించడం. అందుకు తగిన మంత్రి పదవి ఇవ్వడం. సరైన సమయం చూసి చంద్రబాబు రిటైర్ మెంట్ ప్రకటించి లోకేష్ ను సిఎమ్ ను చేయడం.
కానీ ఇప్పుడు బుద్దా వెంకన్న లాంటి వాళ్లు నోరు విప్పడం అంటే లోకేష్ భజన పరుల బృందం తమ పని తాము మొదలుపెట్టడం అన్న మాట. ఇలా మొదలైంది. ఎలా కొనసాగి, ఎక్కడకు వెళ్లి ఆగుతుందో చూడాలి.