భజే వాయు వేగం… హీరో కార్తికేయతో యువి సంస్థ నిర్మించిన సినిమా. ఈ నెలాఖరుకు విడుదల కాబోతోంది. ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. పేరుకు తగినట్లే ట్రయిలర్ మొత్తం రేసీగా సాగింది. రిపీట్ సీన్లు అనిపించకుండా, కథను దాచే ప్రయత్నం చేయకుండా బాగానే కట్ చేసారు. సినిమాలో కాస్టింగ్ చాలా ఎక్కువ వున్నట్లు, కథ నిడివి, సీన్లు పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు ట్రయిలర్ క్లారిటీ ఇచ్చింది.
అంతవరకు బాగానే వుంది. కానీ ట్రయిలర్ చూస్తుంటే కొత్త కాన్సెప్ట్ అని కానీ, కొత్త కథ అని కానీ అనిపించేలా లేదు. గతంలో ఇలాంటి లైన్ తో చాలా సినిమాలు వచ్చినట్లు అనిపిస్తుంది ట్రయిలర్ చూస్తుంటే. డబ్బు అవసరం భయంకరంగా రావడం, అలాంటి టైమ్ లో అనుకోకుండా ఓ అవకాశం రావడం, మంచి చెడ్డ, ముందు వెనుక చూడకుండా దాన్ని అందుకోవడం, దాంతో హీరో కోసం నలువైపుల నుంచి వేటాడే వర్క్ మొదలుకావడం, ఇలాంటి లైన్ తో సినిమా తీసారు అనిపిస్తుంది.
కానీ యువి లాంటి సంస్థ అంత త్వరగా పాత లైన్ ను పట్టుకుని కొత్తగా మాత్రం ఎందుకు తీస్తుంది. ట్రయిలర్ లో చూపించనిది, చెప్పనిది ఇంకా ఏదో వుండే వుంటుంది అనుకోవాలి. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి కూడా సమ్ థింగ్ దాచి వుండొచ్చు ట్రయిలర్ నుంచి. సరే, దాచారా లేదా, అన్నది పక్కన పెడితే చూపించిన ట్రయిలర్ రేసీగా వుంది. ఏదో చుట్టేసారు సినిమాను అన్నట్లు కాకుండా, క్వాలిటీ కనిపిస్తోంది.