హీరో విష్వక్ సేన్ లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ట్రయిలర్ విడుదలైంది. రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య చాలా కాలంగా అనుకుంటున్నారు. మంచి ఇంటెన్సివ్ పొలిటికల్ మూవీని తెరకెక్కించాలని. ఇప్పటికి అది సాధ్యమైంది. ట్రయిలర్ అవుట్ అండ్ అవుట్ మాంచి బలమైన భావోద్వేగాలను కనబరుస్తూ సాగింది.
రాజకీయంగా కింద నుంచి మీద వరకు ఎదిగిన ఓ ఆవేశపరుడైన కుర్రాడి లైఫ్ స్కెచ్ అనుకోవాలి. దానికి అదనపు ట్రాక్ లు జోడించారు. లంకల రత్న పాత్రను తనకు టైలర్ మేడ్ అన్నట్లు మార్చుకున్నాడు విశ్వక్ సేన్. ఆ విషయంలో అతనికి ప్రశంసలు దక్కుతాయి.
ట్రయిలర్ మొత్తం ఎక్కడా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు అనేట్లుగా కట్ చేసారు. లైన్.. లెంగ్త్ కూడా పెర్ ఫెక్ట్ గా సరిపోయాయి. ట్రయిలర్ లో వున్నవి బలమైన డైలాగులు అనలేము. ఎందుకంటే కృష్ణ చైతన్య దర్శకుడి కన్నా ముందు రైటర్. అందువల్ల ఆయన ఇంత బలమైన హీరో పాత్రను, కథను రెడీ చేసుకున్నపుడు అంతకన్నా బలమైన డైలాగులు వుంటాయని ఆశించడం తప్పు కాదు. ట్రయిలర్ ఆరంభంలో, చివరిలో మనుషులు మూడు రకాలు అన్న డైలాగులు రెండూ బాగున్నాయి.
కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న విశ్వక్ సేన్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మరో వైవిధ్యమైన చిత్రంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నటి అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా 31న విడుదల అవుతుంది.