పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందే. పవన్ తో పని అవ్వాలంటే త్రివిక్రమ్ ద్వారా వెళ్లాలని కూడా చాలామంది చెబుతుంటారు. ఈ సంగతి పక్కనపెడితే.. త్రివిక్రమ్-బండ్ల గణేష్ కూడా చాలా క్లోజ్.
ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేశ్ బయటపెట్టాడు. ఇండస్ట్రీలో తనకు ఆప్తుడు అంటూ ఎవరైనా ఉంటే అది త్రివిక్రమ్ మాత్రమే అంటున్నాడు బండ్ల. తన వ్యక్తిగత, సొంత విషయాల్ని ఇండస్ట్రీలో త్రివిక్రమ్ తో మాత్రమే షేర్ చేసుకుంటానని చెబుతున్నాడు.
“నా వ్యక్తిగత విషయాలు, సొంత విషయాలు ఏవైనా ఇండస్ట్రీలో షేర్ చేసుకోవాల్సి వస్తే త్రివిక్రమ్ తోనే షేర్ చేసుకుంటాను. సాధారణంగా ఆయన ఫోన్ ఎత్తడు. 2 రోజుల తర్వాత తిరిగి ఫోన్ చేసి మాట్లాడతారు. ఆయన నాకు ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది. ఇండస్ట్రీలో మన సొంత విషయాలు చెప్పుకుంటే ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువ. అదే త్రివిక్రమ్ కు చెబితే బ్యాంక్ లాకర్ లో ఉన్నట్టే.”
అయితే ఇంత ఇష్టమైన త్రివిక్రమ్ తో మాత్రం సినిమా చేసే ఛాన్స్ రాలేదంటున్నాడు బండ్ల గణేశ్. తను తీసిన తీన్ మార్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాశాడని, తనకు గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించే అవకాశం ఇప్పించింది కూడా త్రివిక్రమే అని అంటున్నాడు.
ఇకపై పూర్తిస్థాయిలో సినిమా నిర్మాణంలోకి దిగుతానని ప్రకటించిన బండ్ల గణేశ్.. త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు. అలానే నూటికి 500శాతం చిరంజీవితో కూడా సినిమా చేస్తానని అంటున్నాడు.