ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపిక పదుకోన్ పై జోరుగా డిస్కషన్ నడుస్తోంది. ఆమె ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే దీనికి కారణం. ఆ సినిమా చేయొద్దంటూ దీపికకు సోషల్ మీడియాలో విన్నపాలు ఊపందుకున్నాయి. కొంతమంది నాట్ మై దీపిక అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుంటే.. మరికొంతమంది ఏకంగా దీపికపై తిట్ల దండకం అందుకున్నారు. నువ్వు మాకొద్దు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఇంతలా దీపిక హాట్ టాపిక్ గా మారడానికి కారణం ఆ సినిమా దర్శకుడు లవ్ రాజన్. గతేడాది కాస్టింగ్ కౌచ్ వివాదంలో ఇరుక్కున్నాడు ఈ దర్శకుడు. 2010లో 'ప్యార్ కా పంచనామా' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఆడిషన్స్ లో భాగంగా తనను లైంగికంగా వేధించాడంటూ ఓ నటి లవ్ రాజన్ పై ఆరోపణలు చేసింది.
ఇప్పుడు అదే దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు దీపిక పదుకోన్ రెడీ అవుతోందని వార్తలు రావడంతో అభిమానులు ఇలా రియాక్ట్ అవుతున్నారు. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో సినిమా చేస్తే, దీపిక పరువు పోతుందని అలాంటి పని చేయొద్దంటూ ఆమెను వేడుకొంటున్నారు అభిమానులు.
మరోవైపు దీపికకు వ్యతిరేకంగా మరో వర్గం కూడా తయారైంది. వీళ్లకు లవ్ రాజన్ తో దీపిక సినిమా చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆ సినిమాలో దీపిక, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో నటించడాన్ని వీళ్లు తప్పుపడుతున్నారు. రణ్వీర్ సింగ్ ను పెళ్లాడిన దీపిక, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో సినిమా చేయడం తప్పంటున్నారు వీళ్లు.
అభిషేక్ ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ తో సినిమా చేయలేదని.. దీపిక కూడా అలానే వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వివాదానికి ఇంతలా కారణమైన ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా చర్చల దశలోనే ఉంది.