ఎప్పుడూ సీరియస్ రోల్స్ యేనా..కాస్త యూత్ ఫుల్ సినిమాలు చేయవచ్చు కదా అని ఫ్యాన్స్ కోరిక తీరుస్తూ ఓ మాంచి లవ్ స్టోరీ చేస్తానని హీరో అడవి శేష్ అన్నారు. ఓ మాంచి లవ్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచో వుందని అన్నారు.
హిట్ 2 సినిమా హిట్ నేపథ్యంలో శేష్ ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇంటర్వూ ఇచ్చారు. సీతారామం సినిమా తనకు ఎంతో నచ్చిందని, ఆ సినిమా మిస్ అయిందని ఎంతో అనుకున్నానని, అయితే దుల్కర్ సల్మాన్ తన కన్నా బాగా చేసాడని అన్నారు. స్వప్నదత్..హను రాఘవపూడి ఇద్దరూ తనకు బాగా తెలుసున్నా, ఎందుకో తను ఛాయిస్ కాలేకపోయాన్నారు.
హిట్ సినిమాలో చిన్న చిన్న మార్పులు అది కూడా తన అనుమానాల కారణంగా చేసినవి తప్ప, టోటల్ స్క్రిప్ట్ క్రెడిట్ దర్శకుడు శైలేష్ దే అన్నారు. ఎ సర్టిఫికెట్ కారణంగా ఆ సినిమాను చాలా మంది చూడలేకపోయారని, కానీ అలా తీయక తప్పలేదని శేష్ చెప్పారు. తన దృష్టిలో దర్శకత్వం, కథ అందించడం వేరు వేరు క్రాఫ్ట్ లు అని, అది వేరు వేరు వ్యక్తులు చేస్తేనే బాగుంటుందని అన్నారు. కథకుడే దర్శకత్వం వహించడం అనేది తనకు ఎందుకో పెద్దగా నచ్చని అంశమని అన్నారు.
కథకుడు కథను అందించడం వరకే అని, కానీ దర్శకుడు ఆ కథను ప్రేక్షకుడి కోణంలో అతడిని ఒప్పించేలా, నప్పించేలా చేయాల్సి వుంటుందన్నారు. అందుకే తాను దర్శకత్వాన్ని వదిలేసా అన్నారు. సినిమా బాగా రావాలన్నదే తన తపన అని, దర్శకుడికి తెలియకుండా ఎడిట్ చేయడం, దర్శకుడు లేనపుడు సినిమాను కోసేయడం లాంటివి చేయనని, దర్శకుడితో కూర్చుని, చర్చించి, ఒప్పించడమే తన పద్దతి అని శేష్ అన్నారు.