“పసికందుగా ఉన్నప్పుడే దుండగులు హీరోను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఓ పాతికేళ్లకు హీరో నాటకీయంగా తన తల్లిదండ్రుల్ని కలుస్తాడు.” పాత తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించే సన్నివేశం ఇది. అయితే ఇలాంటివి సినిమాలకే పరిమితం కాదు, నిజజీవితంలో కూడా జరుగుతుంటాయి. అలాంటి ఘటనే అమెరికాలో జరిగింది.
కిడ్నాప్ కు గురైన 51 ఏళ్ల తర్వాత ఓ మహిళ, అనూహ్యంగా తన తల్లిదండ్రుల్ని కలుసుకుంది. కిడ్నాప్ కు గురైనప్పుడు ఆమె వయసు 21 నెలలు. తిరిగి తల్లిదండ్రుల్ని కలిసినప్పుడు ఆమె వయసు 53 ఏళ్లు.
మెలిస్సా హైస్మిత్ టెక్సాస్ లో జన్మించింది. 21 నెలల వయసులో ఆమె కిడ్నాప్ కు గురైంది. వీధుల్లో దారుణమైన బాల్యాన్ని గడిపింది. అదే టైమ్ లో ఆమె పేరు కూడా మార్చేశారు. మెలిస్సా కాస్తా మెలానీ అయిపోయింది. ఆ తర్వాత ఆమెను ఓ మహిళ 500 డాలర్లకు కొనుగోలు చేసింది. ఆమె మెలిస్సాను పెంచి పెద్ద చేసింది.
అయితే తరచుగా మెలిస్సాకు కలలు వస్తుండేవట. అందులో ఆమెకు పెద్ద కుటుంబం ఉన్నట్టు కనిపించేదంట. దీంతో ఆమె తన బాల్యాన్ని తల్లి ద్వారా తెలుసుకుంది. తల్లిదండ్రుల్ని వెదికడం మొదలుపెట్టింది. అలా 53 ఏళ్ల వయసులో తన కన్న తల్లిదండ్రుల్ని ఆమె తెలుసుకుంది.
కిడ్నాప్ కు గురైన తమ కూతురు 5 దశాబ్దాల తర్వాత ఇలా కళ్లముందు కనిపించేసరికి ఆ వృద్ధ దంపతులకు కన్నీళ్లు ఆగలేదు. కూతుర్ని వాళ్లు ప్రేమగా కౌగిలించుకున్నారు. తనకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నట్టు తెలుసుకొని మెలిస్సా కూడా ఉబ్బితబ్బిబ్బయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.