ఆ సినిమాపై తాము చెప్పిన విధంగా చర్యలు తీసుకునే వరకూ ప్రదర్శన నిలిపివేయాలని బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘ఇది ముమ్మాటికీ ఆ నటికి పరువు నష్టం కలిగించేదే. వెంటనే ఆ చిత్రాన్ని తొలగించండి’ అని బాంబే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమెజాన్‌లో నానీస్ ‘వి’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.
అనుమతి లేకుండా ఆ సినిమాలో తన ఫొటోను వాడారని నటి, మోడల్ సాక్షి మాలిక్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి తన ఫొటోను తీసుకుని , ఆ సినిమాలో తనను కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా పలుమార్లు చూపారని పిటిషన్‌లో సాక్షి పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణలో భాగంగా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇలా చేయడం వల్ల పిటిషనర్‌కు పరువు నష్టం కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా చూపడాన్ని తప్పు పట్టింది. అంతేకాదు, పిటిషనర్ ఫొటోను బ్లర్ చేయడమో లేదా మరో రకంగా కప్పి పెట్టే ప్రయత్నాలు చేయకూడదని, పూర్తిగా తొలగించాల్సిందేనని ఆదేశించింది.
24 గంటల్లో అమెజాన్ నుంచి ఆ సినిమాను తీసివేయాలని సూచించింది. ఆ సన్నివేశాల్లో మార్పులు చేసే వరకు ఇతర ప్లాట్‌ఫారాల్లో, థియేటర్లలోనూ.. ‘వి’ సినిమాను ప్రదర్శించొద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు తనకు న్యాయం చేశాయని సాక్షి చెబుతున్నారు.