మన టాలీవుడ్ అగ్రహీరో అన్నట్టు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఎవరికైనా సరదానా? ఒక్కో సారి పెళ్లిళ్లు కలిసి రావు. అబ్బా యికి నచ్చకో, లేక అమ్మాయికి నచ్చకో …చివరికి విడాకుల బాట పట్టాల్సి వస్తుంది. ఏది ఏమైతేనేం, జీవితానికో తోడు అవసరం. అందుకే ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో ఎన్నిసార్లు విఫలమవుతున్నా…వాటిపై నమ్మకాన్ని చంపుకోరు. అదే ప్రేమ, పెళ్లిళ్లలో ఉన్న గొప్పదనం.
ముఖ్యంగా సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది. వాళ్ల వివాహ బంధంలో ఏ చిన్న పొరపొ చ్చాలొచ్చినా… ఎద్దు పుండును కాకి పొడిచినట్టు, వారి జీవితాలను ఎత్తిపొడుస్తూ ఉంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ధోరణులు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.
తాజాగా ప్రముఖ కోలీవుడ్ నటి వనితా విజయకుమార్‌ను కొందరు అలా ఎత్తి పొడుస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. గత నెలలో పీటర్ పాల్‌ను వనితా మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పీటర్ పాల్‌కు గతంలో పెళ్లి అయింది. పీటర్‌పాల్, వనిత పెళ్లి చేసుకున్న రోజు సాయంత్రం…పీటర్ మొదటి భార్య తెర ముందుకొచ్చింది. తనకు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొత్త జీవితం ఆరంభిద్దామని ఎన్నో కలలు కన్న వనితకు మొదటి రోజే…కొత్త వివాదం తలనొప్పిగా మారింది.
ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో పీటర్, వనిత చూసుకుంటారు. కానీ ఆమె మూడో పెళ్లిపై సినీ ప్రముఖులే విమర్శలు గుప్పించడం ఆశ్చర్యం కలిగించింది. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కుట్టిపద్మినితో పాటు నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖర్ స్పందిస్తూ పీటర్ పాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత వనితను పెళ్లి చేసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
‘మీ పని మీరు చూసుకోండి’ అంటూ వనిత ఫైర్ కావడంతో లక్ష్మీ రామకృష్ణన్, కుట్టి పద్మిని తమ తప్పును గ్రహించారు. వెంటనే క్షమాపణ చెప్పారు. కానీ నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖర్ మాత్రం సారీ చెప్పే ప్రశ్నే లేదని తెగేసి చెప్పాడు.
అంతేకాదు, తనకు నటి వనిత అంటే ఎంతో అభిమానమని కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఒక అభిమానిగా ఆమె తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపే హక్కు తనకు ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. వనితపై అభిమానం ఉంటే…మౌనంగా చూస్తూ ఉండకుండా ఆమె వ్యక్తిగత జీవితాన్ని కాకిలా పొడవడం ఏంటో అర్థం కాదు. ఈ రచ్చ ఇంకెంత కాలం సాగుతుందో కాలమే తేల్చాల్సి ఉంది.