దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఇప్పటికే పలు పుస్తకాలు వచ్చాయి. వైఎస్ భౌతికంగా దూరం అయ్యి 11 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక మంది వైఎస్ జీవితంలోని వివిధ అధ్యాయాలను, వారి వారి కోణాల్లో గ్రంథస్తం చేశారు. వైఎస్ సాగించిన ప్రజాప్రస్థాన పాదయాత్రపై గత ఏడాది సినిమా కూడా వచ్చింది. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ మరో పుస్తకాన్ని తీసుకొచ్చారు. కొందరు రచయితలు వైఎస్ జీవితాన్ని వ్యక్తిత్వ వికాస కోణంలోనూ రచించారు.
ఇప్పుడు ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. వైఎస్ఆర్ పై ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఒక పుస్తకాన్ని రాశారు. వైఎస్ జయంతి సందర్భంగా ఆ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. 'నాలో నాతో వైఎస్ఆర్' పేరుతో ఆ పుస్తకం వస్తోంది. ఎమ్మెస్కో ప్రచురించిన ఆ పుస్తకాన్ని వైఎస్ఆర్ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేస్తున్నారు.
తండ్రిగా, భర్తగా వైఎస్ ఎలా ఉండేవారు, అన్నగా, తమ్ముడిగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా ఆయనెలాంటి వారు, నాయకత్వ జీవితంలో ఈ బంధాలు ఎలా ముడివేసుకున్నాయనే అంశాలను విశదీకరిస్తూ విజయమ్మ ఈ పుస్తకాన్ని రచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ నాయకత్వ లక్షణాలపై, ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు, వ్యవహరించిన తీరుపై గత పదేళ్లలో లెక్కకు మిక్కిలి వ్యాసాలు వచ్చాయి. సాక్షి వాళ్లు ప్రతి యేడాదీ వైఎస్ పై ఏదో ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ విజయమ్మ పుస్తకం ఆసక్తి రేపుతూ ఉంది.