మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై తనవైన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో నాగబాబు ముందు వరుసలో ఉంటారు. జాతిపిత మహాత్మాగాంధీజీని చంపిన గాడ్సేను దేశ భక్తుడని పొగడడం నాగబాబుకే చెల్లిందనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఇక తన కుమార్తె నిహారిక పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి పలు సందర్భాల్లో ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సమాచారం అందిస్తూ వచ్చారు. నిన్నటికి నిన్న కూడా తన కూతురు ఇంకా తన దృష్టిలో చిన్నపిల్లే అన్నట్టు అభిప్రాయ పడుతూ ఓ పోస్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు పెళ్లై అత్తగారింటికి వెళుతుండడంపై నాగబాబులో భావోద్వేగం కనిపించింది.
తాజాగా నాగబాబు బదులు ఆయన తనయుడు, హీరో వరుణ్‌తేజ్ తెరమీదకు వచ్చారు. తన ముద్దుల చెల్లెలు నిహారిక, బావ చైతన్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెల్లిపై వరుణలో దాగిన ప్రేమ ఆ పోస్టులో ప్రతిబింబించింది.
‘నా బంగారు తల్లి నిహారిక, మా డాషింగ్ బావ చైతన్యకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో వర్ణించేందుకు మాటలు సరిపోవు!’ అని వరుణ్ తేజ్ తనదైన స్టైల్లో కొత్తజంటకు విషెస్ చెప్పారు. నిహారిక పెళ్లి సందర్భంగా ఆశీస్సులు అందజేసిన ప్రతి ఒక్కరికీ వరుణ్ ధన్యవాదాలు తెలిపారు. కానీ తండ్రిలా వరుణ్‌తేజ్ ఎప్పుడూ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లరు. అదే వరుణ్ ప్రత్యేకత.