శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ శుభవార్త చెప్పారు. గతంలో దర్శనాల విషయంలో ఉన్న ఆంక్షలను తొలగించడమే ఆ తీయటి వార్త. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని కూడా కరోనా మహమ్మారి విడిచిపెట్టలేదు. నెలల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అనేక నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ సందర్భంగా పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనానికి అనుమతిం చలేదు.
ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఏడుకొండల వాడిని దర్శనం చేసుకునేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారి కోరికను నెరవేర్చేందుకు టీటీడీ మంచి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే…10 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులను దర్శనానికి అనుమతిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే స్వీయ నియంత్రణ చర్యలను చేపట్టి దర్శనం చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల విజ్ఞప్తుల నేపథ్యంలో ఆంక్షలను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అయితే వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్ల సౌకర్యం లేదని అధికారులు తెలిపారు.
గతంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాటు త్వరలో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆంక్షల తొలగింపుతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.