“జాతీయ అవార్డు ఇప్పిస్తా, ఎకౌంట్ లో డబ్బులు వేయండని ఒకడు అడిగాడు. ఆ మాటలు నమ్మి ఓ దర్శకుడు వేల రూపాయలు సమర్పించుకున్నాడు.” ఇంతవరకు మాత్రమే అందరికీ తెలుసు.
ఆ దర్శకుడు వెంకీ కుడుముల అనే విషయం కొందరికి మాత్రమే తెలుసు. అయితే రోజురోజుకు దీనిపై పుకార్లు, కామెంట్లు, సెటైర్లు ఎక్కువయ్యాయి. అంత కామన్ సెన్స్ లేకుండా దర్శకులు ఎలా ప్రవర్తిస్తారనే చర్చలు కూడా ఊపందుకున్నాయి. దీంతో వెంకీ కుడుముల స్వయంగా రంగంలోకి దిగాడు. తనకు ఏం జరిగిందో సమగ్రంగా వివరించాడు.
“ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నవీన్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. భీష్మ సినిమాకు జాతీయ అవార్డు కోసం అప్లై చేద్దామని అన్నాడు. సేంద్రియ వ్యవసాయం కాన్సెప్ట్ అందులో ఉంది కాబట్టి నేషనల్ అవార్డ్ కోసం దరఖాస్తు చేయడంలో తప్పు లేదనిపించింది. ఆ ఫార్మాలిటీస్ చూసుకోమని నా అసిస్టెంట్ డైరక్టర్ కు చెప్పాను. అందులో భాగంగా 63,600 రూపాయలు ట్రాన్సఫర్ చేశాను.”
ఇంతవరకు బాగానే ఉందని, ఆ తర్వాత తనకు అనుమానం మొదలైందని చెప్పుకొచ్చాడు వెంకీ కుడుముల. సదరు నవీన్ అనే వ్యక్తి మరోసారి వెంకీ కుడుములను సంప్రదించి, ఈసారి మరికొంత డబ్బు ట్రాన్సఫర్ చేయాలని కోరాడు. ఆ డబ్బు రిఫండ్ వస్తుందని కూడా చెప్పాడు.
“మళ్లీ డబ్బు అడగడంతో నాకు అనుమానం వచ్చింది. వెంటనే కాస్త లోతుగా పరిశీలించడం మొదలుపెట్టాను. నేను ఇంతకుముందు బదిలీ చేసిన డబ్బు ఫిలిం కార్పొరేషన్ ఎకౌంట్ లో పడలేదు. అదొక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్. డౌట్ వచ్చి కామన్ ఫ్రెండ్ కు ఫోన్ చేశాను. మోసం చేసేవాళ్లు ఎటువైపు నుంచైనా రావొచ్చు.”
మోసపోయిన విషయం తెలుసుకున్న తర్వాత చాలామంది ఈ విషయాన్ని వదిలేయమన్నారని.. కానీ తనలా మరొకరు మోసపోకూడదనే ఉద్దేశంతో తను పోలీస్ కంప్లయింట్ ఇచ్చానని క్లారిటీ ఇచ్చాడు కుడుముల. పొగత్రాగడం, మద్యం సేవించడం మాత్రమే కాదు, అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే అంటూ తన ఓపెన్ లెటర్ ను ముగించాడు.