తెలుగు హీరోలు దొరక్కో..లేదా ఇలాంటి సబ్జెక్ట్ వారు చేయరనో, తమిళ హీరో ధనుష్ దగ్గరకు వెళ్లారు దర్శకుడు వెంకీ అట్లూరి. సర్ సినిమా యావరేజ్ కంటెంట్ అయినా హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాను సితార సంస్థకే చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈసారి హీరో ఎవరు అన్నది పాయింట్.
మొదటి మూడు సినిమాలు తెలుగు హీరోలతోనే చేసాడు. వరుణ్ తేజ్, అఖిల్, నితిన్ లాంటి టైర్ 2 హీరోలతో చేసాడు. ఇప్పుడు తెలుగులో మళ్లీ అదే రేంజ్ హీరోలతో చేయాలి. పెద్ద హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. చాన్స్ ఇస్తారన్న సందేహం వుండనే వుంటుంది.
అందుకే మళ్లీ తమిళ హీరో వైపు చూస్తున్నారట వెంకీ అట్లూరి. లేదూ అంటే మలయాళ హీరో అయినా ఓకె అనుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల రెండు ప్రయోజనాలు. మల్టీ లాంగ్వేజ్ సినిమా చేసినట్లు వుంటుంది. తన మార్కెట్ కూడా అన్ని భాషల్లో ఏర్పాటు అవుతుంది. పైగా తను వీలయినంత తక్కువ బడ్జెట్ లో లాగించేస్తాడు కనుక నిర్మాతకు పెద్దగా ఇబ్బంది వుండదు. పైగా పక్క భాషల్లో డేట్ లు అవైలబుల్ గా వున్న హీరో అయితే చకచకా సినిమాలు చేసేయవచ్చు.
సర్ సినిమా ఇలాగే జరిగింది. అరవై నుంచి అరవై అయిదు కోట్లలో బండి లాగించేసాడు. అందులో సగానికి పైగా రెమ్యూనిరేషన్లే. జస్ట్ పాతిక కోట్లతో ప్రొడక్షన్ జరిగిపోయింది. నాన్ థియేటర్ తోనే నిర్మాత సేఫ్. ఇప్పుడు మళ్లీ అదే ప్రయోగం చేస్తే అటు నిర్మాత సేఫ్. తనకు వెంటనే సినిమా వస్తుంది. ఇంతకీ పక్క భాష హీరో అంటే కార్తీ, సూర్య, దుల్కర్..ఇలా జాబితా చాలానే వుంది. ఎవరు ఫిక్స్ అవుతారో?