తమిళనాట ఒక పెళ్లి కటౌట్ ఒక యువతి మరణానికి కారణం అయ్యింది. ఏఐడీఎంకే నేత ఒకరు తన ఇంట్లో పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కటౌట్, బైక్ లో ప్రయాణిస్తున్న ఒక యువతి మీద పడింది. కటౌట్ ఆమె మీద పడటం, అదే సమయంలో వెనుక నుంచి లారీ వచ్చి ఆమె మీద నుంచి పోవడంతో ఆమె మరణించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేసే తీరుపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి.
నాయకులు, సినిమా అభిమానులు ఈ విషయాల్లో ముందుంటారు. తగిన ఏర్పాట్లు లేకుండా, అవకాశం ఉన్న చోటల్లా ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టేది వీళ్లే. ఇలాంటి నేపథ్యంలో వీరి మీదే విమర్శలు తీవ్రం అయ్యాయి. కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సినీ వెర్రి అభిమానంపై మరింత తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరోలు స్పందించారు. తమ కటౌట్లను ఏర్పాటు చేయవద్దంటూ వాళ్లు తమ అభిమానగణానికి పిలుపునిచ్చారు.
తమిళ స్టార్ హీరోలు విజయ్, సూర్యలు ఈ మేరకు పిలుపునిచ్చారు. సినిమాల విడుదల సమయాల్లో తమ కటౌట్లను ఏర్పాటు చేయవద్దని వారు కోరారు. ఈ విషయంపై 'బిగ్ బాస్' లో కమల్ హాసన్ కూడా స్పందించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే కటౌట్లు, ఫ్లెక్సీల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.
హీరోలు ఇలా స్పందించడం బాగానే ఉంది. అయితే వీళ్లు తమ తమ సినిమాలు విడుదల అయినప్పుడు తమ అభిమానులను నియంత్రించగలరా?