రాజ‌కీయంలో మ‌రో హీరో పాట్లు చూడాలిక‌!

ద‌క్షిణాదిన సినిమా స్టార్ అంటే ఎగ‌బ‌డి ఓట్లేసే రోజులు పోయి చాలా కాలం అయ్యింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలే క‌నీసం ఎమ్మెల్యేలుగా నెగ్గ‌డం క‌ష్టంగా మారింది. త‌న కుల జ‌నాభా ఎక్క‌డైతే ఎక్కువ…

ద‌క్షిణాదిన సినిమా స్టార్ అంటే ఎగ‌బ‌డి ఓట్లేసే రోజులు పోయి చాలా కాలం అయ్యింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలే క‌నీసం ఎమ్మెల్యేలుగా నెగ్గ‌డం క‌ష్టంగా మారింది. త‌న కుల జ‌నాభా ఎక్క‌డైతే ఎక్కువ ఉంటుందో అని లెక్క‌లేసుకుని మ‌రీ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిన ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలు సినిమా తార‌ల‌ను రాజ‌కీయ నేత‌లుగా ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తున్నార‌ని చెప్ప‌డానికి!
 
ప‌వ‌న్ మాత్ర‌మే కాదు, విజ‌య్ కాంత్ అయితే ఏకంగా మూడో స్థానంలో నిలిచి ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచారు త‌మిళ‌నాట‌! ఇక పార్టీ పెట్టినా క‌మ‌ల్ కు పోటీ చేసే ధైర్యం లేక‌పోయింది. ర‌జ‌నీ అయితే పార్టీ పెట్టే ధైర్యం కూడా చేయ‌క వెనుదిరిగారు. మ‌రి ఇప్పుడు విజ‌య్ పార్టీ విష‌యంలో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. 

ఒక ర‌కంగా చూస్తే త‌మిళ‌నాట రాజ‌కీయ శూన్య‌త ఉంది. డీఎంకేకు ఇప్ప‌టికీ సొంతంగా నిలిచే ధైర్యం లేదు. కాంగ్రెస్, క‌మ్యూనిస్టులు వీళ్లంద‌రినీ క‌లుపుకుంటేనే డీఎంకే బ‌లం. ఇక జ‌య మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే కేవ‌లం బీజేపీ అదుపాజ్ఞ‌ల్లో ప‌ని చేస్తూ వ‌చ్చింది. అధికారం చేజారిన త‌ర్వాత ఈపీఎస్-ఓపీఎస్ ల మ‌ధ్య‌న ఆధిప‌త్య పోరు తీవ్ర‌మైంది. ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకురాగ‌ల జ‌యల‌లిత‌, ఆ స్థాయి నేతో ఇప్పుడు అన్నాడీఎంకేకు లేరు. అన్నాడీఎంకే త‌మిళ‌నాట ప్ర‌త్యామ్నాయ శ‌క్తి. అలాంటి పార్టీ నాయ‌క‌త్వ లోపంతో అల్లాడుతూ ఉంది.

ఇలాంటి నేప‌థ్యంలో ఆ శూన్య‌త‌ను ఆక్ర‌మించి, అన్నాడీఎంకే క్యాడ‌ర్ ను త‌మ వైపుకు తిప్పుకునేలా స్టార్ హీరోలు ప్ర‌య‌త్నాలు చేయొచ్చు. అయితే ర‌జ‌నీకాంత్ కు కానీ, క‌మ‌ల్ కు కానీ ఇంత శ‌క్తి లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఆ క్లారిటీ వాళ్ల‌కూ ఉంది.  మ‌రి ఇప్పుడు విజ‌య్ కూడా త‌న ముచ్చ‌ట తీర్చుకోవాల్సి ఉంది. 

విజ‌య్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అత‌డి వీరాభిమానులు కోర‌డం ఇప్పుడేమీ కొత్త కాదు. ప‌దేళ్ల నుంచి అందుకు సంబంధించి ర‌క‌ర‌కాల ఊహాగానాలున్నాయి. విజ‌య్ తండ్రి ఆ మ‌ధ్య ఏదో ఒక పార్టీ కూడా ప్ర‌క‌టించేశాడు. అయితే దానిపై విజ‌య్ నుంచినే వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయ్యింది. మ‌రి ఇప్పుడు విజ‌య్ రాజ‌కీయాల్లోకి అనే ఊహాగానాలు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చాయి.

ఆ మ‌ధ్య క‌మ‌ల్ హాస‌న్ త‌న పార్టీని ప్రారంభిస్తూ త‌న‌తో పాటు రాజ‌కీయాల్లోకి క‌లిసి న‌డ‌వ‌డానికి రావాల‌ని విజ‌య్, ర‌జ‌నీకాంత్ ల‌ను పిలిచాడు. మ‌రి ఆ పిలుపు విజ‌య్ కు ఇప్పుడు ఏమైనా గుర్తుందో లేదో!